జగనన్న ఇలాకా : ఆంధ్రా రైతు అప్పుల కుప్ప?
అప్పుల కారణంగా అన్నదాత రుణ విముక్తి కోసం వేరే దారులు వెతుక్కుంటున్నాడు. అయినా కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టినా కూడా అతడికి కష్టాల నుంచి ఉపశమనం దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా దక్కే రుణ సాయం కన్నా ప్రయివేటు వ్యక్తుల రుణ సాయమే ఎక్కువగా రైతును వేధిస్తోంది.
వరుస వానలు వరదలు కారణంగా ఇవాళ వ్యవసాయంలో సంక్షోభాలే తప్ప సంతోషాలు అన్నవి లేవు. దేశంలోనే మన రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేసి కుటుంబాలను పోషించుకుంటున్న వారిలో టాప్ లో ఉన్నారు. మన తరువాత తెలంగాణ అయినా ఇంకొకటి అయినా! అప్పులకు వస్తున్న దిగుబడులకు సంబంధం అన్నది లేకుండా పోతోంది. దిగుబడి వచ్చిన మద్దతు ధర చిక్కక అవస్థ పడుతున్న రైతులూ ఉన్నారు. ఏటా పంట నష్టం అంచనాల్లో అధికారులు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఉందో కానీ వాస్తవిక స్థితిగతులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
సాగుకు ఏటా ఎదురవుతున్న కష్టాలు, ఎదురవుతున్న ఒడిదొడుకుల నేపథ్యంలో రైతును ఆదుకోవాల్సిన తరుణం ఇది. తీవ్ర తుఫానుల రాక కారణంగా ఏటా పంటలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో చేసిన అప్పులు తీరక, చేతిలో చిల్లి గవ్వ కూడా లేక అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. కొందరు అప్పులు తీర్చే మార్గం దొరకకు ఆత్మహత్యలు సైతం పాల్ప డుతున్నారు. ఈ తరుణంలో సాగు లాభసాటి అని చెప్పడం కన్నా ఘోరమయిన తప్పిదం ఇంకొకటి లేదు. ఎందుకంటే విత్తనం కొ నుగోలు దశ నుంచి పంట చేతికి వచ్చేవరకూ రైతుకు కష్టాలూ కన్నీళ్లే తప్ప ఒనగూరుతున్న ప్రయోజనం ఏమీ లేదు. ఈ దశలో ఆంధ్రావనిలో రైతుల అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సేద్యగాడిని ఆదుకునేందుకు జగన్ అందిస్తున్న రుణ మాఫీ కానీ లేదా పెట్టుబడి సాయం కానీ ఇవేవీ ఆయా వర్గాలకు ఊతం ఇవ్వడం లేదు. మారుతున్న పరిస్థితులకు పెద్దగా అనుకూలంగా ఉం డడం లేదు. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం నిర్థారణ అవుతోంది. 77 వ రౌండ్ సర్వే ప్రకారం రైతన్నల అప్పులు దేశంలోనే టాప్ లో ఉన్నాయి. రుణ గ్రహీతల శాతం 93.2 శాతం అని తేలిపోయింది. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం చూసుకున్నా ఇది ఎక్కువే!