తెలుగు రాష్ట్రాల్లో అధికార ఆశల్లో కమలం..?

Chakravarthi Kalyan
భారతీయ జనతా పార్టీ.. పేరులో భారత్ ఉన్నా బీజేపీ ప్రధానంగా ఉత్తరాది పార్టీనే.. దక్షిణాదిలో ఆ పార్టీ చాలా వీక్.. జాతీయ పార్టీయే అయినా ఒక్క కర్ణాటకలో మినహా మరే పెద్ద దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాత్ర ఆటలో అరటిపండు అన్నట్టుగా ఉంటుంది. కర్ణాటకలో అధికారం చేపట్టిన బీజేపీ అదే స్ఫూర్తితో మరిన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ కొన్నాళ్లుగా దృష్టి సారిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన నేపథ్యంలో ఆ గ్యాప్‌ను పూరిస్తూ బీజేపీ బాగానే ఎదిగింది. గతంలో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలం కాస్త చెప్పుకోదగినట్టుగానే ఉంది. తెలంగాణలో బీజేపీ ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నా.. ఇంత బలంగా మాత్రం ఎప్పుడూ లేదు. ఇక ఏపీ విషయానికి వస్తే.. అంత సీన్ లేనేలేదు. గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు కాస్త ఒకటి, రెండు అసెంబ్లీ సీట్లు.. ఎంపీ సీట్లు అయినా ఉండేవి.. ఇప్పుడు అవి కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ లో  ఆ పార్టీ దాదాపు జీరో అనే చెప్పాలి.

అయితే.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇక తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటలు చేస్తున్నారు. పార్టీ అన్నాక ఆ మాత్రం ఆశలు ఉండటం.. తప్పుకాదు.. ఆ మాత్రం ధీమా కనబరచకపోతే.. కార్యకర్తల్లోనూ పెద్దగా ఆశలు ఉండవు.. అయితే.. ఏకంగా అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పడం ద్వారా బీజేపీ నేతలు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పక తప్పదు. తెలంగాణలో పార్టీకి ఊపు తెచ్చిన బండి సంజయ్.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 80 వరకూ సీట్లు వస్తాయని.. అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు.

అటు ఏపీలోనూ సోము వీర్రాజు ఇదే మాట చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక చర్యలు మానుకోవాలని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్న వీర్రాజు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాల సాయం అందుతోందని చెబుతున్నారు. అమరావతి గురించి మాట్లాడే పేటెంట్ బిజెపికి ఉందని.. అసలు ఎయిమ్స్, మచిలిపట్నం హైవే, రక్షణ పరిశ్రమలు, రాజధాని చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధి చేసింది బీజేపీ ప్రభుత్వమేనంటున్నారు వీర్రాజు. అంతే కాదు... 2024లో ఏపీలో బీజేపీదే అధికారం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: