ఫ్యాన్ ఆంధ్రా : టీడీపీకి మ‌రో ప‌ట్టాభి దొరికేశాడ్రా!

RATNA KISHORE
ఆంధ్రావ‌నిలో మ‌ళ్లీ మ‌రో ప‌ట్టాభి. కోటేశ్వ‌రరావు అనే పేరుతో ఇవాళ మీడియా మీట్ లో విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేశారు. త‌మ అధినేత‌ను ఉద్దేశించి మంత్రి, ప‌సుపు చొక్కా వేసుకున్న  ఒక‌నాటి నేత
ను ఉద్దేశించి చాలా మాట‌లే మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఇరు వ‌ర్గాలూ ఎప్ప‌టిలానే స్థాయి మ‌రిచి ఇంకా చెప్పాలంటే ఎవ‌రి స్థాయిని వారు దిగ‌జార్చుకుని మాట్లాడి ఎప్ప‌టిలానే ఈ మాట‌ల‌కే రాజ‌కీయ రంగు అన్న‌ది ఒక‌టి పులిమి సిగ్గుతో ప్ర‌జాస్వామ్యం త‌ల‌దించుకునేలా చేశారు. ప్ర‌వ‌ర్తించారు. రాజ్యాంగ దినోత్స‌వం రోజున అంబేద్క‌ర్ సాబ్ పేరు ప్ర‌స్తావిస్తూనే కోటేశ్వ‌ర‌రావు చేసిన వ్యాఖ్య‌లు కానీ నిన్న‌టి వేళ టీడీపీ బాస్ చంద్ర‌బాబు ను ఉద్దేశించి ప‌రుష ప‌ద‌జాలంతో తీవ్ర స్వ‌రంతో మాట్లాడిన కొడాలి నానీ కానీ
ఏవీ కూడా ఒక్క శాతం మంచి సంప్ర‌దాయ‌ల‌కు అనుగుణంగా లేవు. ఇక వీటిని నియంత్రించేది ఎవ‌రని?
 
 
రాయ‌లేని భాష మాట్లాడితేనే రాజ‌కీయానికో అందం. ప‌దిమంది ద‌గ్గ‌రా చెప్పుకోలేని భాష మాట్లాడితే మ‌రింత అందం మ‌రియు రాజ‌కీయాల‌కు రాజసం కూడా! ఆ విధంగా మాట్లాడి ప‌ట్టాభి ఆ విధంగా మాట్లాడి కొడాలి నానీ ఆ విధంగా మాట్లాడి వ‌ర్ల రామ‌య్య ఆ విధంగా మాట్లాడి వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఆ విధంగా మాట్లాడి రోజా ఆ విధంగా మాట్లాడి అయ్య‌న్న ఇలా ఒక్క‌రేంటి ఆ పార్టీలోనూ ఈ పార్టీలోనూ ఎంద‌రెంద‌రో ఉన్నారు. వాళ్లంద‌రికీ వంద‌నాలు చెల్లించాల్సిందే! ఎందుకంటే రాయ‌లేని రాయ‌డానికి  వీలులేని భాష‌ను వాడ‌డం..అందుకు త‌గ్గ కార‌ణాలు సాకులు నెపాలు చూప‌డం అన్న‌వి ఒక్క  రాజ‌కీయాల‌కే చెల్లు.

ముఖ్యంగా తెలుగు ప్రాంత రాజ‌కీయాలకే చెల్లు. పోరు తెలంగాణలో అయినా లేదా ఇక్క‌డ‌యినా ఇదే చెల్లు. ఇప్పుడు మ‌రొక‌రు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే లీడ‌ర్ తెర‌ముందుకు వ‌చ్చారు. మొన్న‌టి వేళ ప‌ట్టాభి మాదిరిగానే ఈయ‌న భాష కూడా ఉంది. కానీ ఎవ‌రూ ఏమీ అన‌వ‌ద్దు ఈయ‌న‌ను. ఎందుకంటే ఆయ‌న స్పంద‌న కొడాలి నానీ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి క‌నుక వాళ్లూ వీళ్లూ చూసుకుంటారు మ‌నకెందుకు? మ‌ధ్య‌లో వ‌దిలేద్దాం..వ‌దిలేయండి లేదా నిల‌దీద్దాం.. త‌ప్పుడు భాష‌కు ప్ర‌యోజ‌నం ఏముంద‌ని ప్ర‌శ్నిద్దాం.

నిన్న‌టి వేళ మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన మాట‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కౌంట‌ర్ ఇచ్చారు కోటేశ్వ‌ర‌రావు. వాస్త‌వానికి ఇప్ప‌టిదాకా ఈయ‌నెవ్వ‌రో తెలియ‌దు. ఆ మాట‌కు వ‌స్తే తెలుగుదేశంలో ఈయ‌న అనుభ‌వించిన ప‌ద‌వి కార‌ణంగా ఈయ‌నేం పొందారో లేదా ఆయ‌న ద్వారా ఇత‌రులు ఏ ల‌బ్ది పొందారో కూడా తెలియ‌దు.
కానీ ఆయ‌న కూడా త‌న స్థాయిని మ‌రిచి మాట్లాడారు. అంటే ఇంకా చెప్పాలంటే చాలా నీఛ‌మ‌యిన భాష‌లోనే మాట్లాడారు. నువ్వు నాలుగు అంటే నేను ప‌ది అంటాను అనిపించ‌గ‌ల‌ను అన్న ఉద్దేశంలో భాగంగా ఆయ‌న మాట్లాడారు. విచార‌క‌రంగానే ఉంది ఈ రాజ‌కీయం. ఈ పాటి దానికి మీరెందుకు ప్ర‌జాస్వామ్యం అన్న పేరు పెట్టుకునో బోర్డు త‌గిలించుకునో తిర‌గ‌డం. మీకు న‌చ్చిన విధంగా మీకు మీరు మెచ్చుకునే విధంగా ఇత‌రుల భావోద్వేగాలకు విలువ ఇవ్వ‌కుండా ఇత‌రుల ఇబ్బందిని ప‌రిగ‌ణించ‌కుండా మాట్లాడుతూ పోతుంటే ఇదంతా రాజ‌కీయం అని లేదా దీని రంగే ఇంతేనని స‌ర్దుకుపోవాలా మేం?
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: