జగన్ 2.0 : మీకెందుకు సర్ సీమ అంటే ప్రేమ లేదు!
ప్రతిరోజూ మూడు పార్టీలు కొట్టుకుంటుంటాయి
ప్రతిరోజూ రెండు వర్గాలు తిట్టుకుంటుంటాయి
కానీ అవి చెప్పని నిజం ఒక్కటే
అదే సీమపై సొంత ప్రాంతంపై జగన్ కు కానీ
చంద్రబాబు కు కానీ ప్రేమ లేదు
అభివృద్ధి చెందించాలన్న స్పృహ కానీ
తపన కానీ వీళ్లకు లేవు
ఉన్నోళ్లంతా సీమ ముఖ్యమంత్రులే కదా! జగన్ కు కానీ అంతకుమునుపు చంద్రబాబుకు కానీ సీమ అంటే ఎందుకు ప్రేమ ఉండడం లేదు. అంటే నాలుగు పైసలు వెనుకేసుకునేందుకు అవకాశం ఇచ్చే ప్రాంతం ఇది కాదని వీళ్లంతా తమ సొంత మనుషులను కాదని ఎక్కడో ఉన్న ప్రాంతాలపై కన్నేసి ఉంచారా? ఆ విధంగా రియల్టర్లను? ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నారా? ఆ రోజు చంద్రబాబు తనది కానీ తెలంగాణ నేలకు చెందిన హైద్రాబాద్ అంటే ప్రేమ ఇవాళ జగన్ తనది కాని కాస్తో కూస్తో అభివృద్ధిలో ఉండి నాలుగు రూపాయలు ఆర్జించేందుకు సావకాశం ఉన్న విశాఖ అంటే ప్రేమ. అంటే వీళ్లకు సొంత ప్రాంతం అభివృద్ధి కానీ సొంత మనుషుల యోగ క్షేమాలు కానీ ఎందుకు పట్టవు? ఎందుకు వీళ్లకు కరువు సీమ కష్టాలు పట్టవు? మెతుకులేక వలస పోతున్న ప్రాంతాలన్నీ ఇలానే ఉన్నాయా.. అటు కర్ణాటకతోనూ ఇటు తమిళనాడుతోనూ, మరోవైపు తెలంగాణతోనూ సరిహద్దులు పంచుకునే నేలకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి. ఒక్క చంద్రబాబు అనే కాదు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సీమ అభివృద్ధి ఏమీ లేదనే తేలిపోయింది. ఆ రోజు కొన్ని క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఆయన సీఎంగా రాణించడమే ఎక్కువ కనుక అంతగా ఆయనను నిందించలేం కానీ నల్లారి వారికి కూడా ఈ ప్రాంతంపై పట్టు లేదు. ఆయన మూలాలు ఇక్కడివే అయినా ఈ చిత్తూరు రెడ్డి అనుకున్నంతగా ఏమీ సాధించలేకపోయారు. అదేవిధంగా ఆ కడప రెడ్డి (వైఎస్సార్ ) కి కూడా తమ ప్రాంత అభివృద్ధి పై పెద్దగా ఆసక్తి లేదు. కొన్ని ప్రాజెక్టులు డిజైన్ చేయించినా తరువాత కాలంలో ప్రభుత్వాలు వాటిని సకాలంలో కొనసాగింపు ఇవ్వలేకపోయాయి అన్నది వాస్తవం. దీంతో వైఎస్సార్ కు రావాల్సినంత పేరు రాలేదు.
కరువుతో అల్లాడిన నేల నుంచి కరువు నుంచి సుభిక్షం వైపు మళ్లించే నాయకులు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించాలి. ఇ క్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వైఎస్సార్ కానీ చంద్రబాబు కానీ ఎవ్వరికీ సీమ అంటే ఎందుకు ప్రేమ కలగలేదు. పోనీ వాళ్లు వెళ్లారు
ఇప్పుడున్న జగన్ కు అయినా ఆపాటి ప్రేమ ఎందుకు కలగడం లేదు. కలిగేందుకు ఆయనకు ఆ ప్రాంత మూలాలు తెలియకపో వడమేనా! లేకా మరే ఇతర కారణాలు ఏమయినా ఉన్నాయా? సీమ నుంచి ఇప్పటిదాకా ఎందరో రాజకీయ ప్రముఖులు వచ్చినా కూడా ఆ ప్రాంతం అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించలేకపోయారని? అందుకు కారణాలు ఏమయినా చంద్రబాబు దృష్టంతా ఆ రోజు హైద్రాబాద్ పై ఉంది. రాజశేఖర రెడ్డి దృష్టి కాస్త సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నా అవి కూడా సకాలంలో ఏవీ పూర్తి చేయలేకపోయారన్న అపవాదు ఆయనపై ఉంది. ఇక జగన్ వచ్చాక కూడా సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపైన కూడా ఆయనకు ప్రేమ లేదనే తేలిపోయింది. మిగతా సీమ జిల్లాలపై కూడా ఆయన దృష్టి అంతగా లేదని స్పష్టం అయింది. ఈ కారణంగా అటు అనంతపురం కానీ ఇటు చిత్తూరు కానీ ఇంకా ఇతర ప్రాంతాలు పూర్తిగా ఎటువంటి సాగునీటి యోగ్యతకూ నోచుకోకుండానే ఉన్నాయి. ఓ వైపు ప్రాజెక్టులు పూర్తికాక మరోవైపు చెరువుల కబ్జాలు నిలువరించలేక ఏటా సీమ అయితే అతివృష్టి కారణంగా లేదా అనావృష్టి కారణంగా తిరోగామి దిశలోనే ఉంటుంది తప్ప సరైన, అభివృద్ధి ఫలితాలు అందుకోలేకపోతోంది.