సదరన్ మీట్ : మళ్లీ అదే తిరుపతి..మళ్లీ అదే గతి..
చాలా రోజుల తరువాత బీజేపీ పెద్దలకు తిరుపతి గుర్తుకు వచ్చింది. చాలా రోజుల తరువాత తిరుపతితో పాటు ఆ ప్రాంతంతో మమేకం అయిన మాటలు కూడా గుర్తుకు రావాలి. మరి! వచ్చాయో లేదో తెలియదు. ఎందుకంటే బీజేపీ నాయకులకు మతి మరుపు ఎక్కువ. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా బీజేపీ వాళ్లంతా తిరుపతిలో వాలిపోయారు.
బీజేపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల పెద్దలు విచ్చేశారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ రాలేదు. ఆ ప్రాంత గవర్నర్ తమిళ సై మాత్రం విచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆత్మీయ సత్కారం అందుకున్నారు. ఒక్క ఆమె అనే కాదు అందరూ కూడా తిరుపతి వెంకన్న విగ్రహం అందుకుని శాలువలు కప్పించుకుని ఆనందించారు. అయితే ఏపీకి అందించాల్సిన వరాలు మాత్రం అందించకుండానే ఉన్నారు అమిత్ షా. (ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విచ్చేసి, తమ ప్రాంత సమస్యలు, ఇంకా ఇంకొన్నింటినీ ప్రస్తావించారు)
అమిత్ షాకు కూడా మతిమరుపు ఉందా అంటే ఉందనే అనుకోవాలి. మోడీ కి ఉన్న జ్ఞాపక శక్తి లేమితనం ఒకటి ఆయన స్నేహితుడు, ఆయన అనుచరుడు అయిన హోం మంత్రి అమిత్ షాకు తప్పక ఉండి తీరాలి. లేదంటే ఆయనకు విభజన హామీలు గుర్తుకు రావాలి. ప్రత్యేక జోన్ (రైల్వే కు సంబంధించి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నది) గుర్తుకు రావాలి. విశాఖ ఉక్కు ఎందుకు తుక్కు తుక్కుగా అమ్ముతున్నామో చెప్పేందుకు అయినా ఆయనకు జ్ఞాపక శక్తి ఉండి తీరాలి. కానీ ఇవేవీ ఆయనకు గుర్తుకురావు. జీఎస్టీ బకాయిలు చెల్లింపుల్లో ఉండే జాప్యం నివారించరు. అదేవిధంగా కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వమన్నా ఇవ్వరు. మరేమీ చేయరు. కనీసం పక్క రాష్ట్రం మనకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కూడా ఇప్పించరు. అయినా కూడా అమిత్ షా మన ఊరికి వచ్చి వెళ్తారు. తిరుపతి వెంకన్న దీవెనలు మాత్రం కావాలనే అంటారు. మనకు ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోతున్న, ఏమీ పట్టకుండా పోతున్న అమిత్ షాకు వెంకన్న దీవెనలు మాత్రం ఎలా ఉంటాయని?