కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

Chakravarthi Kalyan
కుప్పంలో అర్థరాత్రి వేళ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు పులివర్తి నాని లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీ నేతలను ఉన్నపళంగా అరెస్ట్ చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు ఇది  అద్దం పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసి కుప్పం నుంచి బలవంతంగా పంపించి... ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి ప్లాన్ అని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి ప్లాన్ ను  ఎట్టి పరిస్థితుల్లో అమలు కానీయబోమని.. కుప్పంలో జగన్ ఆటలు సాగబోవని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్ట్ అప్ర్రాజాస్వామికమన్న చంద్రబాబు  అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.


కుప్పంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రాజుకుంటోంది. నిన్న అర్థరాత్రి కుప్పంలో అలజడి చేలరేగింది.. కుప్పంలోని ఓ హోటల్ లో ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలు బస చేసిన హోటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన సమయంలో  పలమనేరు డిఎస్పీ గంగయ్య తో పాటు లోకల్ పోలీసు అధికారులు ఉన్నారు.


అయితే.. సోమవారం అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదని.. 14వ వార్డును ఫోర్జరీ సంతకలతో ఏకగ్రీవం చేసుకున్నారని.. టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కూడా చేశారు. దీంతో మొత్తం 19 మంది టీడీపీ నేతల మీద కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం అర్థరాత్రి టీడీపీ నేతలు బస చేస్తున్న హోటల్ వద్దకు వెళ్లి అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: