కేసీఆర్‌ Vs ఈటల: కేసీఆర్‌ శత్రువులంతా ఒక్కటయ్యారా..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్‌లో అధికార పార్టీ ఎలా ఓడిపోయింది.. ఇప్పుడు ఇదే తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న అంశం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలిచేందుకు అనేక అంశాలు దోహదం చేసేలా కనిపించాయి. అధికార పార్టీ.. డబ్బుకు కొదువ లేదు.. అందులోనూ దళిత బంధు వంటి పథకాల ఆశ చూపారు. అందులోనూ ఉప ఎన్నిక.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడిస్తే వచ్చే పథకాలు వస్తాయన్న భరోసా ఉండదు. దీనికి తోడు.. చాలా ముందు నుంచే కేసీఆర్‌ ట్రబుల్ షూటర్ హరీశ్ రావును రంగంలోకి దించారు. ఇలా చెప్పుకుంటూ పోతే... హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ పార్టీకి చాలా ప్లస్ పాయింట్స్ కనిపించాయి.


కానీ.. తీరా ఓటింగ్‌ సమయంలో అవేమీ అంతగా పని చేయలేదు. మరోవైపు.. ఈటల రాజేందర్‌ ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. తనను అకారణంగా టీఆర్ఎస్‌ నుంచి బయటకు పంపారంటూ సెంటిమెంట్‌ రాజేసుకుంటూ వచ్చారు. అయితే సెంటిమెంట్ ఒక్కటే ఓట్లు రాల్చదు. ఆ విషయం ఈటల రాజేందర్‌కూ తెలుసు. అందులోనూ ఆయన ఇప్పటికే అదే నియోజకవర్గంలో వరసగా ఆరు సార్లు గెలిచిన వాడు. అక్కడి క్షేత్ర స్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవాడు.


అందుకే ఈటల రాజేందర్ క్రమంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువులంతా ఒక్కటయ్యారని.. అందుకే ఈటల రాజేందర్‌ 24 వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారన్న విశ్లేషణ ఉంది. అదీ నిజమే.. ఎందుకంటే శత్రువు.. శత్రువు మిత్రుడు. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఇదే జరిగింది. తమ పార్టీ గెలవకపోయినా పర్వా లేదు.. కానీ కేసీఆర్ పార్టీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవ కూడదన్న తరహాలో కొన్ని పార్టీలు వ్యవహరించాయి.


ఇప్పుడు అదే కేసీఆర్ కొంప ముంచినట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలన్న ఉమ్మడి లక్ష్యంతో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ హుజూరాబాద్ విషయంలో చేతులు కలిపాయన్న విమర్శలు వస్తున్నాయి. ముందు టీఆర్‌ఎస్‌ను హూజూరాబాద్‌లో ఓడిస్తే.. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చని బీజేపీ, కాంగ్రెస్ ఫీలయ్యాయి. అందుకే కేసీఆర్‌ను ఓడించే విషయంలో సహకరించుకున్నాయి. అదే ఈటలను అనాయాసంగా గెలిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: