నేను మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..
పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టాండ్ పై విశాఖ వేదికగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. రానున్న ఎన్నికలలో కూడా జనసేన, బీజేపీతోనే కలిసి ఉంటుందనేలా క్లారిటీ ఇచ్చారు పవన్. అందుకే విశాఖ ఉక్కు పోరాటంలో కేంద్రాన్ని ఏమీ అనలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించి సరిపెట్టుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలలో జనసేన పోటీ నుంచి విరమించుకున్నప్పటికీ.. బీజేపీ పోటీలో నిలిచింది. దీంతో జనసేన, బీజేపీ స్నేహం ముగిసిందని కొంత చర్చ జరిగింది. అయితే ఆ ఆలోచనలు తప్పని.. పవన్ నిరూపించారు. జనసేన, బీజేపీతోనే ఉందని విశాఖ వేదికగా చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్.
విశాఖ ఉక్కు పరిశ్రమపై తూతూ మంత్రంగా స్పందిస్తే సరిపోదని వైసీపీ నేతలకు క్లాస్ పీకారు జనసేనాని. వారంలోగా వైసీపీ స్పందించాలని..లేదంటే ఉద్యమం తప్పదని డెడ్ లైన్ విధించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి.. చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని.. ఆ త్యాగాలను వృధా కానివ్వనని చెప్పారు. కేంద్రం దగ్గర చేతులు కట్టుకోవడం మానేసి.. పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. కేంద్రం తమమాట వినదని వైసీపీ నేతలు చెబుతున్నారని.. అలాంటప్పుడు కాంట్రాక్టులు, బెయిళ్లు మాత్రం ఇస్తుందా అంటూ ఎద్దేవా చేశారు. ఏదేమైనా పవన్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండానే తన పోరాటాన్ని సాగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీతో కలసి సాగేందుకు నిర్ణయించుకోవడం వల్లే పవన్ ఈ స్టాండ్ తీసుకున్నారు.