మా ఉత్తరాంధ్ర : పట్టు ఎవరికి? పరువు ఎవరిది?
గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికలలో టీడీపీ సాధించేదేంటి అన్నది కూడా కీలకం కానుంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంగా పేరున్నప్పటికీ ఒకప్పటి ఛార్మింగ్ ఇప్పుడు లేదు. అలా అని శ్రేణులు లేరని కాదు. ఉన్నా కూడా నాయకత్వ లేమి కారణంగా ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు.
ముఖ్యంగా పాలకులపై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయం పూర్తి ప్రభావం చూపనుంది. అదేవిధంగా రైల్వే జోన్ ఏర్పాటు కూడా అంతే ప్రభావం చూపనుంది. ప్లాంటు ప్రయివేటీకరణ సాధ్యమే అయితే ఈ ప్రాంతంలో వైసీపీ తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయం. అలా కాకుండా ప్లాంటును ప్రభుత్వమే తీసుకుంటే కాస్తయినా పరువు నిలబెట్టుకునే అవకాశం ఉంది. 15 నియోజకవర్గాలున్న విశాఖలో వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. గాజువాకలో పవన్ పోటీచేసినా ఫలితం లేకపోయింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీను, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేశ్, విశాఖ పశ్చిమం నుంచి గణబాబు టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ సారి మాత్రం ఫలితాలు వైసీపీకి ఆశించే విధంగా రావు గాక రావు. అదేవిధంగా విజయనగరంలో తొమ్మిదికి తొమ్మిది స్థానాలు గెలుచుకున్నా ఇప్పుడు నాటి ఫలితాలు రిపీట్ కావు. బొత్స వర్గం కు పట్టున్నా కూడా గెలుపు మాత్రం సులువు కాదు. గజపతి నగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో బొత్సతో ఆయన మనుషులే విజేతలు.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం కూడా బెల్లాన చంద్రశేఖర్ కూడా బొత్స మనిషే. కానీ ఈ సారి అన్ని ఫలితాలూ బొత్సకు అనుకూలం కావు. అదేవిధంగా శ్రీకాకుళంలో రెండు స్థానాల్లో టీడీపీ అప్పటి ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు పోయిన పరువు కాపాడుకునే ప్రయత్నాలేవో చేస్తోంది. టెక్కలి, ఇచ్ఛాపురం ఆ రోజు గెలుచుకున్నా ఇప్పుడు ఇచ్ఛాపురం గెలుపు మాత్రం సులువు కాదు.