జగన్ రూటే వేరు.. సెపరేటు రూటు. ఎవ్వరికీ అర్థం కాని రూటు. ఎవ్వరికీ చెందని రూటు. చంద్రబాబు కూడా ఇలా అన్నింటికీ ఊ కొట్టలేదు కానీ జగన్ మాత్రం రాష్ట్ర హక్కుల విషయమై మాట్లాడడం అన్నది మానుకుని చాలా రోజులైంది. నల్ల చట్టాలుగా వ్యవహారానికి నోచుకుంటున్న వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై ఇప్పటికే ఆమోదం తెలిపి, పైకి మాత్రం తాము వీటికి వ్యతిరేకం అని చెప్పినా, లేదా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి తలొగ్గినా, వ్యవసాయ పంపులకు వీటిని అమర్చే విషయమై స్థానికంగా వ్యతిరేకత వచ్చినా అవన్నీ జగన్ మెతక వైఖరికి నిదర్శనమే! తాజాగా జలవిద్యుత్ పై వివాదం రేగుతోంది. అదేవిధంగా కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు రాష్ట్రానికి ఇవ్వాల్సినంత కరెంటు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో థర్మల్ విద్యుత్ పై రాష్ట్రం, కేంద్రం సంయుక్తంగా డ్రామాలు ఆడుతున్నాయి.
కేంద్రం ఏం అడిగినా ఇచ్చేందుకు జగన్ ఎందుకనో మొగ్గు చూపుతున్నారు. అస్సలు తగ్గేదే లే అంటున్నారు. మోడీ ఏం అడిగినా ఇచ్చేందుకు సిద్ధం అయిపోతున్నారు. దీంతో ఆంధ్రా హక్కులు అన్నీ కేంద్రానికి బదిలీ అయిపోతున్నాయి. దఖలు పడుతున్నా యి. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ప్రశ్నించకపోవడం విశేషం. టీడీపీ కూడా పవర్ హౌస్ అప్పగింతపై ఇంకా నోరు మెదపడం లే దు. స్థానిక అంశాలు తప్ప కేంద్రానికి సంబంధించిన విషయాల్లో టీడీపీ మొదట్నుంచి వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయించి ఉంటుం ది. లేదా మెతక వైఖరిని అవలంభిస్తోంది.
ఇక శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పవర్ హౌస్ లను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలంగాణ కూడా ఇదే తరహాలో అప్పగిస్తేనే తామూ అప్పగిస్తామని చెప్పినా, మన మాట నెగ్గేందుకు అవకాశాలే లేవని తేలిపోయింది. ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు కానీ వాస్తవం మాత్రం ఒకటి పైకి కనిపిస్తోంది. కేంద్రంతో తగువు పెట్టుకుని అక్రమ కేసులను తవ్వి తీయించుకోవడం కన్నా సామరస్య ధోరణిలో పోయి వ్యక్తిగత ప్రయోజనాలు నెగ్గించుకుని రావాలని జగన్ అండ్ కో యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తోంది. ఇప్పుడు తెలంగాణ తన పవర్ హౌస్ ల అప్పగింత చేసినా చేయకున్నా ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి జల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలంటే కేంద్రం అనుమతి ముఖ్యంగా రివర్ బోర్డ్ అనుమతి రాష్ట్ర ప్రభుత్వం తప్పక తీసుకోవాల్సిందే. అదే పవర్ హౌస్ లు మన పరిధిలో ఉంటే ఇంతటి అగత్యం అయితే ఉండదు గాక ఉండదు.