మంచి వారింటి వారసుడు గెలిస్తే ఏమౌతుంది..అనుకున్నవి సాధిస్తాడా లేదా విమర్శల పాలవుతాడా?
మా ఎన్నికల్లో విష్ణు అధ్యక్ష స్థానం కైవసం చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆయన తరఫున చేపట్టే పనుల జాబితా అన్నది ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడూ చెప్పే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా, మా అసోసియేషన్ కు ఓ భవనం కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అదేవిధంగా పెద్దలకు పింఛన్లు, తోటి కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, ఇప్పించడం అన్నవి కూడా చాలా ముఖ్యం. ఎలానూ సొంత విద్యా సంస్థలు ఉన్నాయి కనుక పేద కళాకారుల కుటుంబాలకు చేయూత ఇస్తామని మంచు మోహన్ బాబు, విష్ణు కూడా ఇదివరకే చెప్పారు. మోహన్ బాబు కూడా ఇదివరకు ఇదే మాట చెప్పి, కొందరికి తమ సంస్థలలో నామ మాత్ర రుసుముతో చోటిచ్చారు అన్నది ఓ సమాచారం. అదేవిధంగా విష్ణు మిగతా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది. గొడవలు, అల్లర్లు వద్దనుకుని మా అసోసియేషన్ అభివృద్ధికి ఆయన కృషి చేయాలి. వెల్ఫేర్ ఫండ్ రైజింగ్ కు కృషి చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా హెల్త్ కార్డుల విషయమై స్పందించాల్సి ఉంటుంది. జారీ అయిన హెల్త్ కార్డులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పించేందుకు అసోసియేషన్ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలి. ఆ విధంగా వారిని ఒప్పించాలి. ఈ పనులు ఎవ్వరున్నా చేయాలి. అందుకు విష్ణు మినహాయింపు కాదు కానీ ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే కొన్ని కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలతో ఆయన మాట్లాడి థియేటర్లకు సంబంధించి పెండింగ్ లో కరెంట్ బిల్లులపై మాట్లాడాల్సి ఉంది. వీటిని రద్దు చేయాలని లేదా వసూలు చేస్తున్న ఛార్జీలు తగ్గించి రాయితీలు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. ఆ పనిచేస్తే ఆయన సక్సెస్ అయిన వారే అవుతారు.