ఈటలకు బిగ్‌ షాక్‌.. బరిలో నలుగురు ఈ రాజేందర్లు..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్‌ ఉపఎన్నిక రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సొంత స్థానంలో టీఆర్ఎస్‌ను ఢీకొట్టి గెలిచిన సత్తా చాటాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉన్నారు. అందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కాస్త ఆలస్యంగా రంగంలోకి దూకింది. బల్మూరి వెంకట్ అనే అభ్యర్థితో నామినేషన్ వేయించింది.


హుజూరాబాద్‌లో నామినేషన్లకు నిన్న చివరి రోజు.. చివరి రోజు భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 61 నామినేషన్లు వచ్చాయి. వీరిలో కొందరు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈనెల 30 న హుజూరాబాద్ పోలింగ్ జరగబోతోంది. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇక్కడ బరిలో ఉన్న ఈటల రాజేందర్‌కు నష్టం చేకూరేలా ఎత్తుగడ వేసింది. రాజేందర్ అనే పేరున్న వ్యక్తులను మరో ముగ్గురిని బరిలోకి దింపింది. ఇలా బరిలో దిగిన వారు కూడా గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారే కావడం విశేషం.


ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో రాజేందర్‌ పేరుతో మొత్తం నలుగురు ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ బరిలో ఎలాగూ ఉన్నారు. నిన్న రాజేందర్‌ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు వేశారు. షాకింగ్ ఏంటంటే.. వారి ఇంటిపేర్లు కూడా ఈటల మాదిరిగానే E అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. వారు ఎవరంటే.. రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్‌, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్‌, ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్‌ నామినేషన్లు వేశారు.


ఈటల రాజేందర్‌కు ఓటేసే వారిని కన్‌ఫ్యూజ్‌ చేయాలన్నదే ఈ వ్యూహం ఉద్దేశం. మరి టీఆర్ఎస్ నేతల వ్యూహం ఏమేరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి. హుజూరాబాద్‌లో మొత్తం గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది బరిలో ఉన్నారు. వీరు కాకుండా మరో  43 మంది స్వతంత్రులు నామినేషన్లు వేసారు. మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్‌ వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: