ఆర్థిక రాజధానిగా పేరు ఉన్న విశాఖను తన గుప్పిటలో పెట్టుకుని భూ సంబంధ వ్యవహారాల్లోనూ తన మాట నెగ్గించుకుని రాజకీ యం చేస్తున్న విజయ్ సాయి రెడ్డి పై ఎన్నడూ లేని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏ పని అవ్వాలన్నా తన మాట లేనిదే జరగని విధంగా నెట్ వర్క్ రూపొందించారని, ఇది ముఖ్యమంత్రికి తలనొప్పిగా ఉన్నా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు అని తెలుస్తోంది. మంత్రులెవ్వరి మాట నెగ్గడం లేదు అని కూడా తేలిపోయింది. అవంతి, దాసన్న, సీదిరి, బొత్స అదేవిధంగా పాముల పుష్పశ్రీవాణి ఇలా ఎవ్వరి మాటకూ విలువ లేకుండా చేస్తున్నారు సాయి రెడ్డి. దీంతో తమ బాధ వెల్లడి చేయలేక, వేరు కుంపటి పెట్టలేక, అవస్థ పడుతున్న వారంతా సీఎంపై గౌరవంతో మౌనంగా ఉండిపోతున్నారు అన్నది వాస్తవం. మూడు జిల్లాల రాజకీయాలనూ అనూహ్యంగా శాసిస్తున్న ఎంపీ సాయిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నా అక్రమాస్తుల కేసుల కారణంగా వాటికి సంబంధించి తనతో పాటు సహ నిందితుడిగా ఉన్న కారణంగా జగన్ ఏమీ అనలేకపోతున్నారు. ఇదే కనుక కొనసాగితే పార్టీకి ఉత్తరాంధ్రలో తీవ్ర నష్టం వాటిల్లనుంది అని కూడా సమాచారం.
ఇంకా చెప్పాలంటే వైసీపీలో బొత్స సత్యనారాయణ ఇమడ లేక పోతున్నారు. పేరుకు మంత్రి అయినప్పటికీ ఎక్కడా ఎవ్వరితోనూ ఏ పనీ చేయించ లేకపోతున్నారు. గతంలో కన్నాభిన్నంగా రాజకీయ వాతావరణం ఉండడంతో తానేం చేయాలో, తన బాధ ఎవరికి చెప్పాలో అన్నది తెలియక తికమకపడుతున్నారు. తాను నేరుగా విజయ్ సాయి రెడ్డిని ఎదుర్కోలేక అవస్థపడుతున్నా రు. కొన్ని సందర్భాల్లో సీఎంతో నేరుగా విభేదించిన ఘటనలు ఉన్నప్పటికీ తన ప్రాధాన్యం మాత్రం నిలుపుకోలేకపోతున్నారు . వైఎస్ హయాంలో ఎంతో ఉన్నతి సాధించిన బొత్స ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఉండిపోవడం వెనుక కారణం సాయి రెడ్డి మాత్రమే! దీంతో ఉత్తరాంధ్ర పరిణామాలపై ఎన్నడూ లేని విధంగా అసంతృప్తత వస్తోంది. ఏ అధికారి కూడా తన మాట వినే పరిస్థితిలో లేడని కూడా బొత్స వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తోంది. దీంతో విజయ్ సాయి రెడ్డి పై తిరుగుబాటు చేయలేక, అలా అని వైసీపీని వదులుకోలేక బొత్స నానా అవస్థలూ పడుతున్నారు.
ప్రయివేటు సంభాషణల్లో సాయిరెడ్డి పై ఎంతో కోపం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సీఎం దగ్గర తగువు మాత్రం తేల్చుకోలేకపోతున్నారు. పరువు నిలుపుకోలేక పోతున్నారు. కీలక నిర్ణయాలు అన్నీ ఆయన చేతిలోనే ఉంటే మంత్రులుగా ఉండి తామెందుకు అన్న ధోరణిలో ఉంటూ వస్తున్నారు బొత్స తో సహా ఇంకొందరు.పార్టీపై ఎంతో నమ్మకంతో ఓటేసిన ప్రజలకు తామేం చెప్పుకోవాలో కూడా తెలియని సందిగ్ధ స్థితిలో ఉంచేస్తున్నారని మండి పడుతున్నారు బొత్స.