మా పోరు : ప్రతి తిట్టూ అవసరమేరా!
ఎన్నికల వేడి మరో వారంలో తగ్గనుంది. దీంతో సమస్యకో పరిష్కారం తప్పక వచ్చేస్తుంది. నిన్నటిదాకా తిట్టుకున్న వారంతా రేపటి నుంచి చెట్టపట్టాల్ వేసుకుని తిరగనున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా బడాయిలకు పోయే నటీనటులకు ఈ మాత్రం కవరేజ్ తప్పక ఉండాల్సిందే! గతంలో కన్నా ఇప్పుడు ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కొత్త టీం కు ఉన్న రెండేళ్ల గడువూ సరిపోతుందా? లేదా ఇప్పటిలానే తిట్లతో రాద్ధాంతాలతో కాలం గడిపేస్తారా?
మా పోరు తీవ్రం అవుతున్న కొద్దీ రోజురోజుకో వివాదం వస్తోంది. నటీనటుల మధ్య వాగ్వాదాలన్నీ మీడియాకు మంచి ఫుటేజ్ గా మారుతుంది. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ, గంటల తరబడి ఛానెళ్లలో గడుపుతున్న సెలబ్రిటీలు అంతా అనవసర రాద్ధాంతానికే కాలం వెచ్చిస్తున్నారు. తిట్ల దండకం అందుకుని సమయాన్ని వృథా చేస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం మాదిరిగానే ఉంది. ఉన్న 900 ఓట్లకు ఎంతమంది వస్తారో తెలియదు. ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడతాయో అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయినా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వైరం వైరల్ అవుతోంది. మా ప్రతిష్టకు సంబంధించి ఎన్నికలు అయినా కాకున్నా కూడా గతంలో జరిగిన తప్పులను వెలుగులోకి తెస్తున్నారు. గతంలో చేసిన తప్పులకు బాధ్యులెవ్వరన్నది చెబుతూ ప్రశ్నిస్తూ కాలం నడుపుతున్నారు.
చిరంజీవి, మోహన్ బాబుల మధ్య వివాదం మా ఎన్నికలకు అసలు కారణం అన్న అభిప్రాయం ఒకటి వెల్లడవుతోంది. కానీ ఈ ఎ న్నికలు ఎవరి ప్రతిష్టను భంగపరుస్తాయో ఎవరి గౌరవాన్ని నిలుపుతాయో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఒకరినొ కరు తిట్టుకోవడంతోనే మా ప్రతిష్ట దిగజారుతుందని ఎవరికి వారు చెప్పుకున్నా, ఎవ్వరూ ఏ కోశాన తగ్గడం లేదు. ఎన్నికలు అయ్యే వరకూ మాట్లాడేదే లేదని మీడియాతో తాను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పానని ప్రకాశ్ రాజ్ అన్నారు. అదేవిధంగా మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్న సభ్యులు మాత్రం అవన్నీ అబద్ధాలేనని, తాము మాత్రమే నటుల సంక్షేమం కోసం పనిచేస్తున్నా మని చెబుతున్నారు. ఈ అర్థం వచ్చేలానే వాళ్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.