టీడీపీ ఆశావహులపై నీళ్లు.. గోదావరి జిల్లాల్లో త్యాగరాజులెవరు..?

Deekshitha Reddy
2024లో ఏపీలో జరగబోయే ఎన్నికల సమీకరణాలు ఇప్పుడిప్పుడే తుది రూపు సంతరించుకుంటున్నాయి. బద్వేల్ ఉప ఎన్నికల వేళ.. జనసేనతో టీడీపీ కలసి వెళ్తుందని, అదే సమయంలో జనసేనకు బీజేపీకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే విషయం అర్థమవుతోంది. టీడీపీ-జనసేన స్నేహం మరింత పెరిగితే 2024నాటికి ఆ రెండు పార్టీలు ఒక ఒప్పందానికి రావడం ఖాయం. ఆ జట్టులో బీజేపీ ఉంటుందో లేదో తెలియదు కానీ టీడీపీ-జనసేన మాత్రం ఖాయంగా కలసి పోటీ చేస్తాయని తెలుస్తోంది.
ఒకవేళ టీడీపీ-జనసేన జట్టు కడితే ఏ పార్టీకి ఎక్కువ లాభం, ఏ పార్టీకి నష్టం అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో కొంతమంది టీడీపీ నేతలు తమ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అదే సమయంలో జనసేన బరిలో దిగలేదు కాబట్టి కాంపిటీషన్ పెద్దగా లేదు. కానీ ఇప్పుడు జనసేన ఏపీలో తన బలం పెరిగిందని బలంగా వాదిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో బీజేపీకంటే ఎక్కువ స్థానాలు సాధించింది. టీడీపీతో కలసి కొన్ని ఎంపీపీ సీట్లను కూడా ఉమ్మడిగా గెలుచుకుంది. ఈ దశలో జనసేన డిమాండ్ చేసినన్ని సీట్లు టీడీపీ ఇచ్చి తీరాల్సిందే.
గోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్..
పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడినుంచే మార్పు రావాలంటున్నారు. అంటే జనసేన తరపున అక్కడ కచ్చితంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఆలోచన. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగితే అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా ఎక్కువ స్థానాలు కావాలంటారు జనసేన నేతలు. మరి ఆ సమయంలో టీడీపీలో ఆయా సీట్లు త్యాగం చేసేది ఎవరు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కావాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అంటే ఆ జిల్లాలనుంచే ఎక్కువమంది త్యాగరాజులు టీడీపీలో సిద్ధంగా ఉండాలనమాట. మొత్తమ్మీద జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఓవరాల్ గా టీడీపీకి లాభమే అయినా.. సీట్లు త్యాగం చేయాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం అది కష్టంగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: