పవన్ మేటర్ : టాలీవుడ్ పెద్దగా నాగార్జున సీన్లోకి త్వరలో!
చిత్ర సీమకు ఇప్పటిదాకా చేసిందేంటి అన్న ప్రశ్న నుంచి చిరంజీవి, నాగార్జున లాంటి పెద్దల సహకారంతో పరిష్కారం అయ్యే సమస్యలేంటి వరకూ అన్నీ ఇప్పుడిక వినిపిస్తాయి. వాస్తవానికి తెలుగు చిత్ర సీమ ఉన్నప్పటికీ అదంతా హైద్రాబాద్ కే పరిమితం అయిపోయిందన్న కోపాలు ప్రభుత్వానికి ఉన్నాయి. అదేవిధంగా జగన్ సీఎం అయ్యాక తెలుగు సినిమా పెద్దలు ఆయనను కలవలేదన్న కోపాలూ ఉన్నాయి..వైసీపీ పెద్దలలో! ఇన్ని కోపాలూ, తగువులూ మధ్యనే చిత్ర సీమ మనుగడ అన్నది నిలదొక్కుకుంటూ వస్తుంది. తాజాగా పవన్ తేనెతుట్ట కదిలించి ఇంకొన్ని కోపాలకు ఆజ్యం పోశారు. దీంతో కుల పెద్ద ఎవరు అన్న తగాదాలో ఇప్పుడంతా ఇరుక్కుపోయారు. గతంలో జరిగిన వివాదాలనూ తవ్వి తీసేందుకు, ఎగ్గొట్టిన పన్నుల వివరాలు రాబట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టాక్ .
గత కొద్ది రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక వాగ్వాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వానికి, పరిశ్రమకూ మధ్యవర్తిగా ఉండాల్సిన వారెవ్వరో తెలియడం లేదు. తెలుగు చిత్ర సీమకు చెందిన వాణిజ్య మండలి మాత్రం తమకు పవన్ చేసిన వ్యాఖ్యలతో సంబంధమేమీ లేదని తేల్చేస్తున్నారు. అదేవిధంగా ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని కూ డా చెబుతున్నారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. రంగంలోకి చిరంజీవి కాకుండా నాగార్జున వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన, నిమ్మగడ్డ స్నేహితులు కావడం, ఉమ్మడి వ్యాపారాలు చేయడం అన్నవి చిత్ర సీమకు కలిసొచ్చే అంశాలు. అదేవిధంగా ఇండస్ట్రీ పెద్దగా తన పేరు వినిపించడం కన్నా నాగార్జున ఇష్యూను సాల్వ్ చేస్తే కొంత వరకూ ఫలితం ఉంటుందని చిరు భావించవచ్చు కూడా! జగన్ కూడా తనపై ఉన్న కమ్మ వ్యతిరేకి అన్న ముద్రను కూడా చెరిపేసుకోనూవచ్చు.
టాలీవుడ్ పెద్దగా సీన్లోకి నాగార్జున రానున్నారా అన్న వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. నాగార్జున కనుక సీన్ లోకి వస్తే చిరంజీవి సైడ్ అయిపోయి, బాధ్యతలు ఆయనకే అప్పగించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది. జరిగేందుకు అవకాశం ఉన్న పరిణామాలు ఏంటి? అన్నవి ఇప్పుడిక ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లీ తండ్రీ గురువూ దైవం లాంటి సినిమాకు ఎవరు హామీగా ఉంటారు. ఎవరు ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకుని, జీవం పోస్తారు. జీవం పోసేవాడు దేవుడు అని అంటారు. వీరికి దేవుడు ఎవ్వరు?