వావ్ వాట్ ఎ ఛేంజ్ : అచ్చెన్నను జగన్ క్షమించాడు!
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పటి నుంచో కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అలానే కొన్ని ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్నారు. ఆయనను రాజకీయంగా నిలువరించేందుకు సొంత జిల్లా మనుషులే కంకణం కట్టుకున్నారని, అందుకే తరుచూ ఏవో కేసులతో వేధిస్తున్నారని అచ్చెన్నాయుడి అభిమానులు అంటారు. కానీ అచ్చెన్న మాత్రం తన దూకుడు తగ్గించు కోకుండా పై స్థాయి వ్యక్తులను సైతం వెనుకా ముందూ చూడక వ్యాఖ్యలు చేస్తూ కెమెరాలకు చిక్కుకుపోతుంటారు. ఈ క్రమంలో అచ్చెన్నతో పాటు సభాపతిని నిందించి, దూషించిన మరో మాజీ శాసన సభ్యుడు కూన రవి. వీరిద్దరిపైనా సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. రెండు దఫాలు విచారణకు కూన హాజరు కాలేదు.
ఆయన గతంలో విప్ గా కూడా పనిచేశారు. సభా సంప్రదాయాలను విడిచి మాట్లాడడంతో కూన వివాదంలో ఇరుక్కుపోయారు. తన సొంత మామ సీతారాం పై ఎన్నో మాటలు అన్నారు. ఈ మొత్తం తగాదాలో తగ్గిన అచ్చెన్న తన వివరణను ప్రివిలైజ్ కమిటీకి చెప్పి, ఇందుకు దారితీసిన పరిణామాలు అన్నింటినీ వివరించి సభా హక్కుల సంఘం నుంచి ఇవాళ ఉపశమనం పొందారు. కానీ ఆయనపై మరో వివాదం ఉంది. పింఛన్ల వివాదంలో నిమ్మల రామానాయుడు (పాలకొల్లు ఎమ్మెల్యే) , మద్యం షాపుల విషయంలో అచ్చెన్న సభను పక్కదోవ పట్టించారన్న అభియోగం ఉంది. దీనిపై కూడా సభా హక్కుల సంఘం విచారణను చేపట్టినా ఇందుకు సంబంధించిన నోట్ ను వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎంత వారైనా తప్పులు చేయకుండా ఉండగలరా. ఉంటే రాజకీయంలో ఉండగలరా. ఎవ్వరయినా సరే తమ తప్పులకు దిద్దుబాటు చర్య ఒకటి ఉంటుందని అనుకుంటేనే రాణించగలరు. రాజకీయ రంగంలోఅచ్చెన్నాయుడు దూకుడు ఉన్న మనిషి. స్వభావ సిద్ధంగా ఆవేశపరుడు. నిదానంగా ఆలోచించి మాట్లాడే వ్యక్తిత్వం ఆయనిది కాదు. అందుకే ఆయన వివాదాలకు చిరునామాగా నిలుస్తారు. అయితే ఎన్ని అనుకున్నా కొన్ని విషయాల్లో బాగానే ఉంటారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ప్రివిలైజ్ కమిటీ ఎదుట హాజరవుతానని గతంలో తలెత్తిన వివాదంపై ఆయన స్పష్టమయిన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాసన సభా హక్కుల కమిటీ (ప్రివిలైజ్ కమిటీ) సమావేశమైంది. స్పీకర్ ను దూషించిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అచ్చెన్న క్షమాపణలు చెప్పడం తో వీటిని పరిగణనలోకి తీసుకుంది ప్రివిలైజ్ కమిటీ. దీంతో అచ్చెన్నపై క్రమశిక్షణ చర్యలు ఈ విషయమై తీసుకోబోమని కూడా స్ప ష్టం చేసింది.