శ్రీకాకుళం వార్త : ఓట్లకు చెద ప్రజా స్వామ్యానికీ చెద?
స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పై అనేక విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చెదలు కనిపిస్తే కొన్ని చోట్ల తడిచిపోయి బ్యాలెట్ పేపర్లు బాక్సుల నుంచి బయటకు వచ్చాయి. ఇవన్నీ చూశాక ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో ఓ సారి అర్థం చేసుకోవచ్చు. మన అధికారులకు ఉన్న శ్రద్ధ ఏపాటిది అన్నది కూడా తేలిపోయింది. ముఖ్యంగా ఎలక్షన్ కు కౌంటింగ్ మధ్య దూరం పెరిగిపోవడంతో స్ట్రాంగ్ రూమ్ లనిర్వహణ అన్నది అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో పలుచోట్ల బ్యాలెట్ బాక్సు లకు సరైన చోట భద్రపరచడం అన్నది అధికారులకు చేతగాలేదు. ఇన్ని నిర్లక్ష్యాలకు ఆనవాలుగా నిలిచిన స్థానిక ఎన్నికల ఫలితా లు అధికార పక్షానికో కానుక అయినప్పటికీ వీటి నుంచి ప్రజలకు ఒరిగేదేంటన్నది సిసలు ప్రశ్న. ఎమ్మెల్యేలకు లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ఫండ్ అన్నది ఎక్కడా విడుదల కావడం లేదు. అలాంటిది జెడ్పీలకూ ఎలా నిధులు విడుదలవుతాయి? నిధుల కొరత వెన్నాడితే అభివృద్ధి ఎలా? అన్నది డౌట్. ఈ తరుణంలో బ్యాలెట్ బాక్సుల నుంచి వచ్చిన ఓట్లు ఎలా ఉన్నాయో చెప్పేందు కు తార్కాణంగా నిలిచింది శ్రీకాకుళంలో ఘటన. శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భద్ర పరిచిన బ్యాలెట్ బాక్సులలో ఓట్లకు చెదలు ప ట్టాయి. ఇవాళ లెక్కింపు కారణంగా అధికారుల అలసత్వం ఏంటన్నది బయటపడింది. దీంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత అజాగ్రత్తగా అధికార వర్గం పనిచేస్తే, ఓట్లేసిన తమ గతేం కావాలని ప్రశ్నిస్తున్నారు. గార మండలం , బందరువా నిపేటలో ఓట్లకు చెద అన్నది వెలుగు చూసింది.ఇక్కడ 600కు పైగా ఓట్లు చెదలు పట్టాయి. ఇదే తీరులో మందస మండలం, రాం పురం, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలోనూ,తొలుత పేర్కొన్న గార మండలంకు చెందిన సతివాడలోనూ ఓట్లకు చెదలు పట్టా యి. చెదలు పట్టిన ఓట్లను లెక్కించకూడదని అధికారులు నిర్ణయించారు.