విజీనగరం వార్త : రాజకీయాలకు రాజుగారు గుడ్ బై!
ఇంకా చెప్పాలంటే...
విజయనగరం రాజకీయంలో చతురుడు. సౌమ్యుడు. టీడీపీకి వీరవిధేయుడు. ఉన్నత విద్యావంతుడు. డు డు డు అతడు. అశోకుడు. పూర్తిపేరు పూసపాటి అశోక్ గజపతి రాజు. అన్న ఎన్టీఆర్ నుంచి అల్లుడు చంద్రబాబు వరకూ అందరితోనూ సఖ్యతతో ఉన్న నాయకుడు ఆయనే. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు.
ముఖ్యంగా జగన్ అపరిపక్వ నిర్ణయాలు, మాన్సాస్ ట్రస్టు విషయమై సాయిరెడ్డి చేసిన ఆరోపణలు ఇవన్నీ ఆయనను బాగా కలతకు గురిచేశాయి. విజయనగరం పైడితల్లి ఆలయంతో పాటు సింహాచలం దేవస్థానంతో పాటు ఇంకొన్ని ఆలయాలకు ఆ కుటుంబం ఆనువంశిక ధర్మకర్తలు. సుదీర్ఘ కాలం రాజకీయ రంగంలో ఉన్న అవినీతి లేని కుటుంబం. అటువంటి కుటుంబంపై సాయిరెడ్డి లాంటి వారు చేస్తున్న ఆరోపణలేవీ ఇప్పటివరకూ నిరూపితం కాలేదు. అంతేకాదు ఆరోపణలు చేసిన ప్రతిసారీ న్యాయ స్థానాల ఎదుట ఆయన ఓడిపోయారు కూడా! అయినప్పటికీ సాయి రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. మాన్సాస్ ట్రస్టు అన్నది ఏ నాటి నుంచో విద్యా బుద్ధులు నేర్పడంలో తనదైన పంథాలో నడుస్తోంది. అతి తక్కువ ఫీజులకే విద్యను అందిస్తోంది. కానీ విజయ్ సాయి రెడ్డి చెప్పిన విధంగా ఆ సంస్థ ఉందీ అనడంలో అర్థం లేదు. ఇక సంచయితను అడ్డుపెట్టుకుని సాయి రెడ్డి రాజకీయాలు నడపడం కూడా ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకుని క్రియాశీల రాజకీయా లకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతం ఆయన కూతురు రాజకీ యాల్లో ఉన్నారు. కానీ ఆమె తండ్రికి తగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారన్నది ఓ వాస్తవం.