తల్లి రాజీనామా: జగనన్న ఒంటరి?

Chakravarthi Kalyan
వైఎస్‌ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారా.. ఇప్పుడు తెలుగు పొలిటికల్ సర్కిళ్లో ఇదో హాట్ టాపిక్.. వైసీపీ ప్రారంభం నుంచి ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఆమె పెద్దగా ఆ పదవి ద్వారా రాజకీయాలు నడిపింది మాత్రం ఏమీ లేదు. జగన్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీని కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో జగన్ సీఎంగా ఉన్నారు. వైసీపీకి ఆమె సేవలు ఇప్పుడేమీ అవసరం లేదు. అయితే ఆమె మరో సంతానం షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అడుగు పెట్టడమే కాదు.. ఏకంగా ఏదో ఒక రోజు తెలంగాణ సీఎం అవుతానని శపథం కూడా చేశారు.

ఇప్పుడు కూతురు శపథం నిజం చేసే ప్రయత్నంలో విజయమ్మ బిజీగా ఉన్నారు. షర్మిలకు తెలంగాణలో మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వైఎస్ వర్థంతిని ఓ అవకాశంగా మలచుకుంటున్నారు. ఆ రోజు వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న తెలంగాణ నేతలను కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ సమావేశంలో విజయమ్మ తెలంగాణ నేతలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇలా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి తన సేవలు అవసరం అని భావిస్తున్న విజయమ్మ.. త్వరలోనే.. వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం వేగంగా పావులు కదుపుతున్న విజయమ్మ.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ ముఖ్యనేతలతో ఆమె సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి వైఎస్సాఆర్ కి అతి దగ్గరగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికారు. వారితో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నందున ఆ పదవికి రాజీనామా  చేసి.. వైఎస్సార్‌టీపీకి గౌరవఅధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూతురి కోసం వైఎస్ విజయమ్మ తాపత్రయం అర్థం చేసుకోదగిందే అయినా.. వైసీపీకి రాజీనామా చేయడాన్ని పార్టీ శ్రేణులు ఎలా అర్థంచేసుకుంటాయో చూడాలి. ఏదేమైనా విజయమ్మ పూర్తిగా షర్మిల భవిష్యత్‌ కోసం తాపత్రయపడుతుండటంతో.. జగన్‌ ఒంటరి అయ్యారా అన్న చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: