తాలిబన్ల గురించి పాక్ జర్నలిస్టు రాసిన షాకింగ్ వ్యాసం..?
పాక్‌కు చెందిన జర్నలిస్టు ఇక్బాల్ కట్టర్ రాసిన ఈ వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఈయన రాసిందేమింటంటే.. మధ్య యుగాల నాటి చట్టాలు అమలు చేయాలని తపన పడే తాలిబన్లు.. అఫ్గాన్‌లో మహిళలకు బ్యూటీ పార్లర్లను కూడా అనుమతించ లేదు. కాకపోతే పురుషుల కోసం అనుమతించారు. అయితే.. ఇదే తాలిబన్లు తమ భార్యల కోసం మాత్రం ఈ బ్యూటీ పార్లర్ల నుంచి కొంత సామాగ్రి తీసుకువెళ్లేవారట. ఆ సామగ్రితో తమ భార్యలను అలంకరించుకుని మురిసిపోయేవారట.
అంతే కాదు.. తాను గడ్డం గీసుకునేందుకు కూడా పైరవీ చేయించి అనుమతి పొందాల్సి వచ్చిందని ఈ పాక్ జర్నలిస్టు ఇక్బాల్ రాసుకొచ్చారు. ఆనాటి తాలిబన్ల పాలనను గుర్తు చేస్తూ సుదీర్ఘ వ్యాసం రాసిన ఈ జర్నలిస్టు.. ఇప్పుడు మళ్లీ అఫ్గాన్‌కు చీకటి రోజులు వచ్చాయని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం మనం గమనించాలి. పాకిస్తాన్ కూడా తాలిబన్లను కోరుకునే రాజ్యమే. అందుకే అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రాగానే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బానిస సంకెళ్లు తెగిపోయాయి అంటూ వ్యాఖ్యానించాడు.
తాలిబన్ల పాలనను అంతగా కోరుకునే పాకిస్తాన్ మాత్రం తాలిబన్ల తరహా ఆంక్షలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చదువుకున్న పాక్ ముస్లింలు చాలామంది గడ్డాలు పెంచుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. అంతే కాదు.. సినిమాలు, టీవీలు, సంగీతం ఎంజాయ్ చేస్తారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు.. కానీ.. షరియా చట్టం అమలు చేస్తామంటున్న తాలిబన్లను మాత్రం సమర్థిస్తారు.. ఇదే మరి పాక్ ద్వంద్వనీతి.