కర్నూలుకు హైకోర్టు ఇవ్వలేని జగనన్న.. హెచ్చార్సీ ఆఫీసు ఇచ్చాడా..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ కర్నూలుకు ఎన్నో చేద్దామనుకున్నారు. ఏకంగా కర్నూలును న్యాయరాజధాని చేయాలనుకున్నారు. కర్నూలుకు ఏపీ హైకోర్టును తీసుకెళ్దామనుకున్నారు. కానీ.. ఎన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏమిటి.. అన్న బాలయ్య డైలాగ్‌ ఇప్పుడు గుర్తొస్తుంది. బహుశా అందుకేనేమో.. హైకోర్టు వస్తుందో రాదో తెలియదు.. అందుకే కాస్త కంటితుడుపుగా ఇప్పుడు జగన్ కర్నూలుకు మరో కార్యాలయం తరలిస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయం.

ఈ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నుంచి ఏపీ హెచ్ ఆర్సీని కర్నూలుకు మారుస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు 2017 అక్టోబర్ 24 తేదీన ఏపీ హెచ్ ఆర్సీని విజయవాడలో ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. అలాగే ఏపీ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రధాన కార్యాలయం కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇప్పటి వరకు ఏపీ లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు తాత్కాలికంగా హైదరాబాద్ నుంచే పని చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని కూడా కర్నూలుకు తరలిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ చిన్న చిన్న కార్యాలయాలు కాకుండా పెద్ద పెద్ద ఆఫీసులే కర్నూలుకు తీసుకురావాలని జగన్ కలలు కన్నారు. దాని ఫలితంగానే మూడు రాజధానుల బిల్లుకు ప్రాణం పోశారు. కానీ.. ఆ మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

కోర్టులకు చేరిన ఈ మూడు రాజధానుల బిల్లుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. మొన్నటికి మొన్న మరోసారి విచారణకు వచ్చినా.. అబ్బే కరోనా బాగా ఉందండి.. ఇప్పుడు విచారణ ఎందుకండీ అని పిటిషనర్లు అభ్యంతరం చెప్పారు.. మరోసారి విచారణ వాయిదా పడింది. ఇలా ఇంకెన్ని వాయిదాలో.. జగన్‌ పాలనాకాలం ఇప్పటికే సగం గడిచిపోయింది. మరి మిగిలిన సగం కాలంలో అయినా ఆ మూడు రాజధానుల కల సాధ్యమవుతుందా.. ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: