ఆమె ..టీం బీజేపీనా? టీం కాంగ్రెస్ నా?
నిరుద్యోగ దీక్షలు మాత్రం కాస్త ఊరట
అయినా ఆమె ఎటు? ఏ పార్టీ వైపు మొగ్గు ?
ప్రతి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో ఢిల్లీలో సఖ్యతతో ఉండాలి. సఖ్యత అన్నది ప్రజల కోసం కాదు తమ ప్రయోజనం కోసం అని గుర్తించాలి. కేసీఆర్ కొంత కాలం కాంగ్రెస్ తో ఇప్పుడు బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. జగన్ కూడా బీజేపీకి బంధువే. కాంగ్రెస్ తో విభే దాలు పెట్టుకుని బయటకువచ్చినా, రేపో మాపో పాత బంధాల పునరుద్ధరణ అన్నది సాధ్యం కావొచ్చు. కాంగ్రెస్ కు పొలిటికల్ ఎ డ్వైజర్ గా ప్రశాంత్ కిశోర్ వచ్చారు కనుక ఆయన మార్గంలో సాయిరెడ్డి అండ్ కో ఇప్పటికే వెళ్తున్నారు కనుక ఇది కూడా సాధ్యమే! ఎంఐఎం కూడా తెలంగాణ వాకిట బలమయిన గొంతుక వినిపించే పార్టీనే. మహారాష్ట్రలో కూడా కాస్తో కూస్తో పట్టున్న నేతలే వీరు. ఈ పార్టీ కూడా బీజేపీకి బంధువే.బయటకు తిట్టుకున్నా వీరంతా ఓ తాను ముక్కలే. ఇక తెలంగాణలో మనుగడలో లేని టీడీపీ, మ నుగడలో లేని ఇంకొన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు జాతీయ పార్టీలతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగినవే. ఈ తరుణంలో షర్మిల ఎ టు?
వాస్తవానికి షర్మిల పార్టీ పెట్టిన రోజు తాము బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి, తరువాత మాటల్లో ఎక్కడా మోడీ వ్యతిరేకతను వినిపిం చలేదు. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేశారు.అంటే ఆమె బీజేపీకి మద్దతుగా ఉంటారనా? లేకా కేంద్రంలో రేపు వచ్చే ప్రభుత్వానికి అనుగుణంగా తమ నిర్ణయం వెలువరుస్తారు అని భావించవచ్చా? ఇప్పటికీ జగన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంచి స్నేహమే ఉంది. విభేదాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఇప్పటికీ వీరంటే అభిమానం కనబరుస్తారు. ఆ క్రమంలో రేపటి వేళ జగనన్న పార్టీ బాటలోనే షర్మిల కూడా నడచి కేంద్రంలో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ఏమయినా చేస్తారా? అన్నది కూడా కీలకమే!
వాస్తవానికి ప్రాంతీయ పార్టీలన్నీ తమకు తాము మనుగడను కాపాడుకోవాలి. తమంత తాము నిలదొక్కునేందుకు రాజకీయం చేయాలి. కానీ రాష్ట్రాలలో రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు వేర్వేరు. కనుక ఇక్కడ తిట్టి అక్కడ పొగిడిన దాఖలాలే ఎక్కువ. మరోవైపు సొంత సామాజికవర్గంకు చెందిన కిషన్ రెడ్డి లాంటి నేతలు షర్మిలను ఏమీ అనరు. మహిళ అనే సింపతీ కూడా ఆయా వర్గాల్లో ఉంది. ఇవన్నీ ఆలోచించినా ఓ కూటమి ఏర్పాటుచేసినా లేదా స్వచ్ఛందంగా అంశాల వారీ మద్దతుతో జాతీయ పార్టీలకు అండగా ఉన్నా షర్మిల సాధించాల్సింది ముందు పరిణితి. రాజకీయ పరిణితి ఆమెలో లేనంత వరకూ ఆమె పార్టీ సాధించేది ఏమీ ఉండదు. జాతీయ రాజకీయాలపై మొదట్నుంచి వైఎస్ కుటుంబానికి ఆసక్తి లేకున్నా కొంత కాలం ఢిల్లీ రాజకీయాల్లో జగన్ కీలకంగా ఉన్నారన్నది వాస్తవం. తరువాత పరిణామాల నేపథ్యంలో సాయిరెడ్డి ఉన్నా ఆయనకు ఢిల్లీ రాజకీయాలపై పట్టు రాలేదు సరికదా నవ్వుల పాలయ్యారు. మిధున్ రెడ్డి మాత్రం కాస్త బెటర్. అవినాశ్ రెడ్డి సెషన్ వరకూ కాస్త నయం. ఇలా వైఎస్ కుటుంబం నుంచి ఉన్న ఆ నలుగురూ ఇవాళ ఢిల్లీలో పెద్దగా ప్రభావం లేని లీడర్లే.మరి! షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది .. ఎటువైపు తన ప్రయాణాన్ని సాగించనుంది అన్నది కాస్త ఆసక్తిదాయకం. పాత కోపాలు మరిచిపోయేందుకే ఇవాళ వైఎస్సార్ కుటుంంబం ప్రయత్నిస్తోందని వినికిడి. అదే జరిగితే పాత స్నేహాలు పునరుద్ధరణ జరిగి కాంగ్రెస్ గూటికి అనుగుణంగానో అనుబంధంగానో జగన్, షర్మిల నడుచుకోవచ్చు.