కృష్ణానదిలో 130 లారీలు.. అరచేతిలో ప్రాణాలు..?

Chakravarthi Kalyan
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130కి పైగా లారీలు కృష్ణానదిలో చిక్కుకుపోయాయి. అనుకోకుండా వచ్చిన వరదలో లారీలు నదిలో చిక్కుకున్నాయి. లారీలు నదిలో చిక్కుకుపోవడం ఏంటి అనుకుంటున్నారా.. వాస్తవానికి అవి రోడ్డు మీదే ఉన్నాయి.. కానీ.. ఆ రహదారిని ఉన్నట్టుండి కృష్ణా వరద ముంచెత్తింది.. దారిలో చిక్కుకుపోయి.. ముందుకు పోలేక.. వెనక్కు రాలేక.. ఆ లారీలన్నీ వరదలోనే చిక్కుకుని పోయాయి. ఊహించని వరద ఒక్కసారిగా ముంచుకు రావడమే ఈ ప్రమాదానికి అసలు కారణం.
అనుకోకుండా వచ్చిన వరదతో ఆ లారీల డ్రైవర్ల గుండె గుభేలు మంది. చుట్టుముడుతున్న వరద నీటిని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాగోలా ఒడ్డుకు చేరారు. వాళ్లయితే బయటపడ్డారు కానీ.. లక్షల విలువ చేసే లారీలు మాత్రం వరద నీటిలోనే ఉండిపోయాయి. ఏమాత్రం వరద పెరిగినా ఆ లారీలు నదిలో కొట్టుకుపోవడం ఖాయం.. అలా ఒక్కసారి నీటిలో పడితే ఇక ఆ లారీ ఎక్కడ చేతికి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. వరద తగ్గకుండా లారీలు బయటకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది.

ఇంతకీ ఇది జరిగింది ఎక్కడో చెప్పలేదు కదా.. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద కృష్ణా నది వరదలో  130 వరకూ లారీలు చిక్కుకుపోయాయి. ఇవన్నీ ఇసుక తరలించేలా లారీలు.. ఇసుక కోసం నదిలోకి వచ్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తింది. లారీలు వెళ్లే మార్గం కొట్టుకుపోయింది. నదిలోకి వెళ్లడం కుదిరింది కానీ.. బయటకు వచ్చే దారి కనిపించడం లేదు. ఆ లారీలకు చెందిన  డ్రైవర్లు, క్లీనర్లు, పనివాళ్లు హడావిడిగా బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. లారీలు మాత్రం చిక్కుకుపోయాయి.

ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పడవల్లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను కాపాడారు. అధికారుల సూచనలతో పులిచింతల నుంచి వస్తున్న వరద ఆపేశారు. కృష్ణమ్మ ప్రవాహం తగ్గితేనే లారీలు బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: