బాబోయ్‌ డెల్టా జోరు.. భయపెడుతున్న ఆర్‌ ఫ్యాక్టర్..?

Chakravarthi Kalyan
దేశంలో డెల్టా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అయితే దేశంలో రోజూ 40వేల వరకూ కరోనా కొత్త కేసులు వస్తున్నా.. ఆ సంఖ్య పెరుగుదల అంత వేగంగా లేదు. మొదట్లో కరోనా థర్డ్ వేవ్ ఆగస్టులోనే వస్తుందని అంచనా వేసినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. అప్పుడే ఆగస్టులో అడుగుపెట్టి ఓ వారం దాటింది. ఇప్పటి వరకూ మూడో వేవ్ సంకేతాలు కనిపించలేదు. అయితే కొత్త కరోనా కేసులు భారీగా పెరగనంత మాత్రాన కరోనా మూడో వేవ్ ముప్పును తోసిపుచ్చలేమంటున్నారు నిపుణులు.

కరోనా కేసుల పెరుగుదల అంత ఎక్కువగా లేకపోయినా.. దేశాన్ని మరో అంశం భయపెడుతోంది. అదే ఆర్ ఫ్యాక్టర్. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రతను తెలిపే అసలైన ఫ్యాక్టర్ ఈ ఆర్‌ ఫ్యాక్టర్. ఒక్క కరోనా రోగి నుంచి ఎంత మందికి కరోనా సోకుతుంది అన్న దాన్ని బట్టి ఈ ఆర్ ఫ్యాక్టర్ ను గణిస్తారు. సాధారణంగా ఈ ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే వ్యాధి తీవ్రత కంట్రోల్‌లో ఉన్నట్టు.. ఈ ఆర్‌ ఫ్యాక్టర్ ఒకటి దాటిన కొద్దీ పరిస్థితి తీవ్రత పెరుగుతుందన్నమాటే.

అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత సూచించే ఆర్‌ ఫ్యాక్టర్ అనేక రాష్ట్రాల్లో ఒక పాయింటు మార్కును దాటేసింది. ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఆర్‌ ఫ్యాక్టర్ 1.4 శాతం వరకు నమోదు అయ్యింది. అందుకే కరోనా విలయం మొదటి దశను మించిపోయింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆర్‌ ఫ్యాక్టర్‌ 1ని దాటడమంటే కొవిడ్ ఆందోళనకరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఇది వరకే హెచ్చరించింది కూడా.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌ ఫ్యాక్టర్ రేటు1.01గా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో దాదాపు 1.4కి చేరిన ఆర్‌ ఫ్యాక్టర్‌ ఆ తర్వాత మాత్రం 0.7కి తగ్గింది. కానీ ఇప్పుడు కరోనా మూడో దశ వచ్చిందో రాలేదో తెలియని స్థితిలో మాత్రం ఆర్ ఫ్యాక్టర్ 1.01కి చేరింది. కనీసం పది రాష్ట్రాల్లో దేశ సగటు కంటే ఎక్కువగా ఆర్ ఫ్యాక్టర్ నమోదు అవుతోంది. అందుకే అప్పుడే కరోనా వెళ్లిపోయిందని రిలాక్స్ అవ్వొద్దంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: