బాలిక ప్రాణం తీసిన కూల్ డ్రింక్.. తాగిన ఐదు నిమిషాలకే?
తమిళనాడు రాజధాని ప్రాంతమైన చెన్నై నగరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సంతోషంగా కూల్ డ్రింక్ తాగిన బాలిక కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటివరకూ సంతోషంగా కళ్ళముందే ఆడుకున్న కూతురు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆరోగ్యంగా ఉన్న తమ కూతురు కూల్ డ్రింక్ తాగడం వల్లనే చనిపోయిందని అంటూ ఇక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నైలోని బీసెంట్ నగర్ కు చెందిన సంతోష్, గాయత్రి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే ఇటీవలే రెండవ కుమార్తె 13 ఏళ్ల ధరణి స్థానికంగా ఉన్న ఒక కిరాణా షాపులో కూల్ డ్రింక్ కొనుగోలు చేశారు. సంతోషంగా ఆ కూల్ డ్రింక్ తాగింది. కానీ కేవలం ఐదు నిమిషాలకే ఆమె శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు . దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిమిషాల్లో కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కూల్ డ్రింక్ తాగడం వల్లనే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.