ఇండియాలో విజృంభిస్తున్న డెల్టా.. ఏ రేంజ్‌లో అంటే..?

Chakravarthi Kalyan
డెల్టా వైరస్.. ఇప్పుడు ఇండియాను వణికిస్తున్న వైరస్ ఇదే.. ఎందుకంటే.. ఇప్పుడు మన దేశంలో వస్తున్న కరోనా కేసుల్లో మూడొంతులు ఈ ఒక్క వేరియంట్ కారణంగానే వస్తున్నాయట. మన దేశంలో అనేక రకాల కరోనా వైరస్‌లు కనిపించాయి. అయితే ఎక్కువగా వ్యాప్తి అవుతున్న వైరస్‌ మాత్రం డెల్టా వైరస్సేనట. ఇతర వేరియంట్లు తక్కువగా వ్యాపిస్తుంటే.. డెల్టా వైరస్ మాత్రం రెచ్చిపోతోందట. ఈ విషయాన్ని కరోనా జన్యు క్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం.. ఇన్సాకాగ్‌ తన నివేదికలో బయటపెట్టింది.

డెల్టా వైరస్ నుంచి వచ్చిన డెల్టా ఉప రకాల్లో కూడా దాన్ని మించిన శక్తి కలిగిన రకాలు లేవట. మన దేశంలోనే కాదు.. డెల్టా రకం ప్రపంచవ్యాప్తంగానూ వేగంగా విస్తరిస్తోందట. ఆగ్నేయాసియా సహా అనేక దేశాల్లో కరోనా విజృంభణకు ఈ డెల్టా రకం కారణమవుతోందట. భారత్‌లో కరోనా రెండో ఉద్ధృతికి డెల్టా వేరియంట్‌ ప్రధాన కారణమని చెబుతున్న ఇన్సాకాగ్‌  మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. అవేంటంటే.. వ్యాక్సీన్ పొందిన వారికి కూడా కరోనా సోకడానికి డెల్టా రకమే ప్రధాన కారణమట.

టీకా తీసుకున్నా కరోనా వచ్చిన వారిలో నూటికి 10 మంది ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం వచ్చిందట. వారిలో మరణాల శాతం 0.4 గా ఉందట. అందుకే భారత్‌లో వ్యాక్సినేషన్‌ చాలా కీలకమని..  ప్రజారోగ్య చర్యల వల్ల వ్యాధి వ్యాప్తి తగ్గుతుందని ఇన్సాకాగ్ నివేదిక చెబుతోంది. ఇక ఈ డెల్టా వైరస్‌ బ్రిటన్‌, అమెరికా, భారత్‌లో అనేక కొత్త వేరియంట్లకు కారణమైందట. ఈ డెల్టా వైరస్‌ నుంచి కె417ఎన్‌, ఏ222వీ, కె77టి వేరియంట్లు వచ్చాయట. కానీ ఇవి డెల్టా అంత డేంజర్ కావని ఇన్సాకాగ్ చెబుతోంది.

కేవలం ఇండియాలోనే కాదు.. చైనా, రష్యా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లోనూ ఇటీవల వచ్చిన  కరోనా కేసుల్లో 75 శాతం డెల్టా రకం వల్లే వచ్చాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా చెబుతోంది. వ్యాక్సీన్ కార్యక్రమం ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తున్నా.. మొత్తం 6 దేశాల్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోందట. ఇక ఇతర వేరియంట్ల విషయానికి వస్తే.. ఆల్ఫా కేసులు 180 దేశాలు, బీటా 130 దేశాలు, గామా 78 దేశాలు, డెల్టా 124 దేశాల్లోనూ వెలుగు చూశాయట. అంతే కాదు.. ఈ  డెల్టా రకం సోకినవారికి దగ్గరగా వెళ్లినవారు తక్కువ సమయంలో పాజిటివ్‌గా మారిపోతున్నారట. సో.. డెల్టా ఈజ్ వెరీ డేంజరస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: