జగన్ ఇచ్చిన మాటే.. గుర్తు చేస్తే అంత ఇబ్బందేంటి..?
జనసేన చేపట్టిన.. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్న పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.. వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు.. అర్థరాత్రి ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, గృహ నిర్భందాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం చేశారని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఇలా చేయడం కచ్చితంగా నియంతృత్వ పోకడేనని ఆయన మండిపడ్డారు.
30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం, పాలకులు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వినతి పత్రాలు ఇస్తామంటే అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు నాదెండ్ల మనోహర్. జనసేన శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి పిలుపు ఇస్తే ఎందుకు ముఖ్యమంత్రి ఇబ్బందిపడుతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జగన్ చేసిన వాగ్ధానాన్ని గుర్తు చేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
వైసీపీ నాయకులు భారీ సభలు నిర్వహించి, ఊరేగింపులు చేసి, సన్మాన కార్యక్రమాలు చేసుకొంటే లేని ఇబ్బంది యువత కోసం జనసేన శాంతియుతంగా చేపడితే వచ్చిందా.. అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ నిలదీశారు. జనసేన కార్యక్రమాలకు ఇచ్చే నోటీసులు, వర్తించే నిబంధనలు అధికార పార్టీ హంగామాలకు, కార్యక్రమాలకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు.