తాజాగా ఏపీ లో ఈ రోజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు, ప్రజా సంఘాలు కలిసి నిరసన వ్యక్తం చేశాయి. నిరసనలో భాగంగా టీడీపీ నేతలు సాహసానికి గారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రమాదంలోకి నెట్టివేశారు. కాస్త అటూ ఇటూ అయినా అక్కడ ఉన్న వారి ప్రాణాలు అందరివి గాల్లో కలిసి పోయేలా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో పాటు టిడిపి కార్యకర్తలు నిరసన కు దిగారు. నెల్లూరు పట్టణం లో ఎంతో రద్దీగా ఉండే గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రోడ్డుపై వలయాకారంగా నిల్చున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు తమ చుట్టూ గుండ్రంగా మంటలు అంటించుకున్నారు. మధ్యలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టిడిపి కార్యకర్తలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.
అయితే వారు అంటించిన మంటలు భగభగ మండుతున్నా మధ్యలో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన నినాదాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు పదిహేను నిమిషాల పాటు టిడిపి నేతలు చేసిన కార్యక్రమం తో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనుభవం లేని తుగ్లక్ పాలన కారణంగానే రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే మరోవైపు ఇంటి పన్నులు పెంచి ప్రజలపై పిడుగులు వేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.
పెట్రోల్ రూ.108...డీజిల్ రూ. 101 అలాగే పప్పు దినుసుల ధరలు ఇతర నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. అంతే కాకుండా ఈ సందర్భంగా మంత్రి అనిల్ పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అనిల్ పెన్నా ఇసుకను 100 కోట్లకు అమ్ముకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ ను కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సర్వేపల్లి కాలువ పేరుతో కోట్లు రూపాయలు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాము గెలిస్తే అసలు ఒక్క రూపాయి కూడా పన్నులు వేయమని చెప్పిన మంత్రి అనిల్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.