
మోడీకి జగన్ సంచలన లేఖ ?
కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం సహా, ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడి. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరాన్ని ఆ లేఖలో నొక్కి చెప్పారు వైయస్ జగన్. రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. కానీ, దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారని వివరించారు.
ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న ఊహ అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిథ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వివరించారు. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీమిలిటేషన్ అంశం విస్తృతస్థాయిలో ఆందోళనకు దారి తీస్తోందని చెప్పారు. 42 మరియు 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారని వెల్లడించారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకేస్థాయిలో పలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారన్నారు.