జగన్ వన్ మ్యాన్ షోకు బాబు-పవన్‌లు బ్రేక్ వేస్తారా?

M N Amaleswara rao

ఏపీలో సోలోగా జగన్‌ని ఎదురుకోవడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదనే చెప్పొచ్చు. అసలు ఎప్పుడు పొత్తు లేకుండా పోటీ చేయని చంద్రబాబు గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేశారు. టీడీపీ ఒంటరిగా బరిలో దిగి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఒంటరిగానే జగన్ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నారు. అయినా సరే బాబుకు ప్లస్ అవ్వడం లేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి విఫలమయ్యారు.


ఇక ఈ పరిస్తితిని చూస్తే బాబు నెక్స్ట్ ఎన్నికల్లో ఏదొక పార్టీతో పెట్టుకోకపోతే చాలా కష్టం అవుతుంది. అయితే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల తర్వాత కొద్దో గొప్పో బలం ఉన్న పార్టీ జనసేననే. అంటే జనసేనతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటేనే జగన్‌కు బాబు కాస్త చెక్ పెట్టే అవకాశం దక్కుతుందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ చాలా బలంగా ఉన్నారు. అలాంటి బలమైన నాయకుడుని ఢీకొట్టడానికి చంద్రబాబు బలం ఏ మాత్రం సరిపోవట్లేదు.


బాబుకు పవన్ తోడైతే కొంచెం వైసీపీని ఎదురుకునే ఛాన్స్ ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్లే వైసీపీని ఓడించారని చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అధికారంలోకి రాగలగిలిగింది. గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. అటు జనసేన సైతం ఏ మాత్రం ఓటు బ్యాంక్ లేని కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పితో కలిసి బరిలో దిగింది.


జగన్ దెబ్బకు ఈ రెండు పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. ముఖ్యంగా జనసేన కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీ గెలుపుపై ప్రభావం పడింది. అదే వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అలా కాకుండా అప్పుడే టీడీపీ-జనసేనలు కలిసి బరిలో ఉంటే వైసీపీ మెజారిటీని కాస్త తగ్గించగలిగేవారు. కనీసం ఈ రెండు పార్టీలు కలిసి ఓ 50 సీట్లు అయినా గెలుచుకునేవారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిస్తేనే జగన్‌ని ఎదురుకోగలరని, లేదంటే జగన్ వన్ మ్యాన్ షో కొనసాగుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: