ఫీజులు పెంచొద్దు.. విద్యామంత్రి వార్నింగ్‌.. స్కూళ్లు వింటాయా..?

Chakravarthi Kalyan
కరోనా తగ్గింది.. స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెరవకపోయినా ఆన్ లైన్ క్లాసులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలు ఫీజుల వసూళ్లు ప్రారంభించాయి. పాత బకాయిలు వసూలు చేస్తూ కొత్త ఏడాదికి ఫీజులు ఎంతో చెబుతున్నారు. కొన్ని పాఠశాలలు ఫీజులు పెంచాయి కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యామంత్రి స్కూళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నూతన విద్యా సంవత్సరంలోనూ  రాష్ట్రంలోని అన్ని బోర్డుల పరిధి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచవద్దని ఆదేశించారు.
విద్యామంత్రి ఆదేశల మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం జీవో 75 జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా  రుసుములు పెంచొద్దని జీవో ఇచ్చారు. అప్పట్లో  2020 ఏప్రిల్‌లో జారీ అయిన జీవో 46కు అనుబంధంగా ఇప్పుడు కూడా మరో జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారం ట్యూషన్‌ ఫీజును మాత్రం నెల వారీగా వసూలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  జీవోలో పేర్కొన్నారు.
ఈ ఆదేశం రాష్ట్ర బోర్డుతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర అంతర్జాతీయ బోర్డులకూ వర్తిస్తుందని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా తెలిపింది. తమ ఆదేశాలను పాటించకుంటే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆదేశాలు ధిక్కరిస్తే.. ఇచ్చిన నిరభ్యంతర ధ్రువపత్రాల వెనక్కి తీసుకుంటామని, యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చింది.
ఈ కొత్త జీవో ప్రకారం 2019-20లో ఉన్న ట్యూషన్‌ ఫీజునే ఇప్పుడూ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏటా 8-15 శాతం రుసుములను ప్రైవేట్‌ పాఠశాలలు పెంచుతుంటాయి. రెండేళ్లు పెంచకుంటే 16-30 శాతం తగ్గించినట్లే అవుతుంది. తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన ఈ జీవోను తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. కానీ.. ఈ జీవోను స్కూళ్లు అమలు చేస్తాయా.. లేదా.. దొడ్డిదారిన కొత్త ఫీజులు వసూలు చేస్తాయా అన్నది తేలాల్సిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: