మోదీని గద్దె దించే వ్యూహంలో దీదీ ?

VAMSI
వెస్ట్ బెంగాల్ లో దీదీ మంచి ఊపు ఉంది. గడిచిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీని మట్టి కరిపించి టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంది. దీనితో ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీని క్షేత్ర స్థాయిలో బలపరిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ అంతకు మించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కేంద్రంలో మోదీని దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో ఢిల్లీ లో బీజేపీ వ్యతిరేక టీం ను తయారుచేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికల్లో మమేకమై ఉంది. గతంలోనే మోదీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ విషయంపై లేఖలు పంపి వారికి అర్థమయ్యేలా వివరించారు. ఆయా రాష్ట్రాలు కూడా మమతా ప్రణాళికలో భాగమయ్యేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీదీ ఆ ప్రణాళికను తన రాష్ట్రము నుండే ప్రారంభించేందుకు పావులు కదుపుతోంది. మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉన్న ముకుల్ రాయ్ వివిధ కారణాల వలన టీఎంసీని వీడి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే బెంగాల్ బీజేపీలో ముకుల్ కు సరైన సహకారం లేకపోవడం, పార్టీలో అంతర్గత బేధాల కారణంగా గత వారంలోనే మళ్ళీ సొంత గూటికి చేరారు. ఇప్పుడు మమతా ముకుల్ కి ఉన్న రాజకీయ అనుభవం మరియు ఢిల్లీ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకుని ఈయనకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముకుల్ కు పార్టీల బలాలు, బలహీనతలు గురించి మంచి పట్టు ఉంది. అంతే కాకుండా కేంద్రంలో మోదీని దెబ్బ తీసేందుకు ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అన్న విషయాలపై పూర్తి అనుభవం ఉంది. ముఖుల్ ఇప్పటికే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ కి జాతీయ స్థాయిలో రాజకీయంగా మంచి పేరున్న కారణంగా ఈయనను ముఖుల్ కలిసినట్లు సమాచారం. త్వరలోనే ఇతను కూడా మమతతో కలిసే అవకాశాలున్నాయి. దీనితో ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఉన్న నాయకులంతా దీదీకి సపోర్ట్ చేస్తారన్న టాక్ ఉంది.
సీనియర్ నాయకుడు ముఖుల్ రాయ్ బీజేపీని వీడడంతో బెంగాల్ లోని మిగతా బీజేపీ నాయకులలో అలజడి మొదలయ్యేలా ఉంది. దీనితో మరికొంతమంది బీజేపీని వీడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న సంవత్సరంలో మొత్తం ఆరు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా అప్పటి నుండే తమ వ్యూహాలను అమలుపరచనున్నారు. ఈ విధంగా జాతీయ స్థాయిలో టీఎంసీ ని మరింత బలపరచడానికి ముఖుల్ రాయ్ కీలకంగా మారే అవకాశం ఉంది. వీరు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించనున్నారు. ఇలా అవకాశం ఉన్న అన్ని పరిస్థితులను ఉపయోగించుకుని మోదీని దెబ్బ తీసేందుకు దీదీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ప్రక్రియలో ముకుల్ ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: