ఇవాళే పోలవరం ప్రాజెక్టు తొలి ఫలం..!

Chakravarthi Kalyan
పోలవరం ప్రాజెక్టు తొలి ఫలం నేడు అందబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా  డెల్టాకు స్పిల్ వే మీదుగా గోదావరి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి ఏపీ సర్కారు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ అంకురార్పణ చేస్తున్నారు. అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ఈసీ తో పాటు తదితర అధికారులు, మేఘా ఇంజనీరింగ్ నుండి రంగరాజన్ పాల్గొంటున్నారు. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేస్తారు. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరుతుంది. పంట పొలాలను సశ్యశ్యామలం చేస్తాయి.
ఈ భారీ వర్షాల  సీజన్ లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి చేశారు. దీనితో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు ఒక రికార్డ్ గా చెబుతున్నారు. అతి తక్కువ సమయం భారీ పనులు,నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టా కు నీరందించే ప్రక్రియను పూర్తి చేశామని మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెబుతోంది.
అయితే పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కూడా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. నిన్న అమిత్‌షా తో, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రకాశ్ జవడేకర్ వంటి వారితో జరిగిన సమావేశాల్లోనూ పోలవరం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: