"హిడెన్ స్ప్రౌట్స్" కూల్చివేత‌పై సీఎస్ కు లేఖ రాసిన చంద్ర‌బాబు.!

విశాఖపట్నంలోని వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ ను కూల్చివేయడం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. ఈ లేఖ‌లో చంద్ర‌బాబు..... వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైనదని పేర్కొన్నారు. లాభాపేక్షలేని వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ ను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం విచారకరమ‌ని చంద్ర‌బాబు అభిప్రాయప‌డ్డారు. ప్రస్తుతం ఇది సుమారు 190 మంది విద్యార్థులతో నడుస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన వారేని చంద్ర‌బాబు తెలిపారు. 

పాఠశాలకు ఎటువంటి వ్రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా సహజ న్యాయం సూత్రాలకు వ్యతిరేకంగా కూల్చివేత జరిగిందని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. నాగరిక సమాజంలో ఇటువంటి దారుణమైన చర్యకు అనుమతించడం సిగ్గుచేటని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మనలాంటి ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగబద్ధంగా పాలన సాగించే దేశంలో ఇటువంటి చర్యల వల్ల కలిగే ఆవేదన మాటల్లో వ్యక్తపరచలేమని తెలిపారు. చట్టం, న్యాయం అనే నాగరిక నిబంధనలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2021 జూన్ 5 న మానసిన వికాలాంగుల పాఠశాలను కూల్చివేసిన తరువాత వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక హక్కును కోల్పోయిందన్నారు. 

ఈ నేపథ్యంలో, సమాజానికి నిజమైన సేవా స్ఫూర్తితో పని చేస్తున్న లాభాపేక్షలేని సంస్థలకు గట్టి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న‌ట్టు తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత కలిగిన పిల్లల పాఠశాల అయిన హిడెన్ స్ప్రౌట్స్‌ లో చదువుతున్న పిల్లలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారుల సహకారంతో ఇటువంటి భయంకరమైన చర్యలకు కారణమైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని లేఖ‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: