సమగ్ర భూ సర్వేపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు . ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’ పై చర్చించారు . సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌తో మంద గమనంలో ఉన్న పథకం పరుగులు పెట్టాలని జగన్ వ్యాక్యానించారు. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలని తెలిపారు. క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని జగన్ అన్నారు. పథకాన్ని పూర్తి చేయడానికి అంకిత భావంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలని తెలిపారు . పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే వెంటనే వేగం చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు . సర్వే పూర్తయితే అన్నింటికీ క్లియర్ టైటిల్స్ ఇవ్వాలన్నారు.
ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాలు , అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు . అక్కడ సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు . 2023 జూన్ నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలన్నారు. ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలన్నారు . ప్రస్తుతం అందిస్తున్న జనన మరణ పత్రాల్లాగే అన్ని రకాల సర్టిఫికెట్టు సచివాలయాల్లో అందేలా చూడాలన్నారు . సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్ ఫార్మాట్ లో ఉండాలని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా ఉండాలన్నారు . ఓ డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు . సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచాలన్నారు .