యాస్ తుపాన్.. కరోనా రోగులకు ప్రాణ గండం?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి యాస్ తుపాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్‌ కారణంగా ఒకటి, రెండు రోజులు ఏపీ తీరం వణికిపోనుంది. కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీకి తుపానులు కొత్తేమీ కాదు.. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. చాలా మంది రోగులు ఆక్సిజన్‌ సపోర్టుతోనే కరోనాపై పోరాడుతున్నారు. చాలాచోట్ల ఆక్సిజన్ అందర రోగులు మరణిస్తున్నారు.

సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే..ఇక తుపాను సమయంలో ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం పొంచి ఉంది. తుపాను కారణంగా ఎక్కడైనా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే..రోగుల ప్రాణాలు పెద్ద సంఖ్యలో పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తుపాను వేళ ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.

యాస్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాలపై వుంటుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. కరోనా రోగుల కోసం రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రావాల్సిఉంది. అందుకే దీన్ని అర్జంటుగా ఈనెల 24 లోగా  సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తుపాను ప్రభావం పడకుండా అంగుల్, కరీం‌నగర్, రూర్కెల నుంచి కూడా రోడ్ మార్గం‌లో ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

మరో వైపు విశాఖ పట్నం పోర్టుకు  120 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓ ట్యాంకర్ల్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పంపింది. 120 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను గుంటూరు, తిరుపతి లో బఫర్  స్టాక్ పద్దతిలో స్టోర్ చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నంలోని ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఈఐఎల్, లిక్వినాక్స్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు  ఆక్సిజన్ ఉత్పతి కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందజేయాలని నిర్ణయించింది.

కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు‌ లేకుండా ముందస్తుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు సిద్దం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: