పినరయి విజయన్ సంచలన నిర్ణయం వెనుక..?

Chakravarthi Kalyan
కేరళ సీఎంగా కమ్యూనిస్టు దిగ్గజం పినరయి విజయన్ రెండోసారి సీఎం పీఠం అధిరోహిస్తున్నారు. అసలు కేరళలో ఓ సీఎం ఎన్నికల్లో గెలిచి రెండోసారి  పీఠం ఎక్కడం దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఫీట్ సాధించిన వ్యక్తి  పినరయి విజయన్. పినరయి విజయన్ తో పాటు ఆయన మంత్రులు కూడా బాగా పని చేశారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే.. విజయన్ మాత్రం తన కొత్త మంత్రివర్గంలోకి అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నారు. పాత మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా మళ్లీ అవకాశం ఇవ్వలేదు.
బహుశా ఇలాంటి సాహసం చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అయితే కరోనా సమయంలో అద్భుతంగా పని చేసి దేశవ్యాప్తగా గుర్తింపు పొందిన మంత్రి శైలజను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈ నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే.. అందరినీ కొత్త వాళ్లనే తీసుకోవాలన్నది పార్టీ నిర్ణయంగా విజయన్ చెబుతున్నారు. పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నాక అంతా దానికి కట్టుబడి ఉండాల్సిందే.. మినహాయింపులు ఉండవు.
మరి కేరళ కమ్యూనిస్టులు ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. ఈ ప్రశ్నకు సమాధానం బెంగాల్‌లో దొరుకుతుంది.. అదేంటి.. కేరళ ప్రశ్నకు సమాధానం బెంగాల్లో ఎందుకు అంటారా.. అవును.. కేరళ కామ్రేడ్లు బెంగాల్‌ ఎర్రన్నలనును చూసి పాఠాలు నేర్చుకుంటున్నారు. బెంగాల్‌లో కొన్నాళ్ల క్రితం వరకూ ఎదురులేని కమ్యూనిస్టులు.. బుద్దదేవ్ భట్టాచార్య తర్వాత సరైన నాయకత్వం లేక పూర్తిగా చతికిల పడ్డారు. దాదాపు 30ఏళ్లకుపైగా  ఏకబిగిన బెంగాల్‌ను ఏలిన కమ్యూనిస్టులు మొన్నటి ఎన్నికల్లో కేవలం 2-3 సీట్లు మాత్రమే సాధించారు.  
పార్టీ ముందుచూపు లేకపోవడం ఇందుకు కారణమని భావిస్తున్న కేరళ కమ్యూనిస్టులు.. ఇక్కడ అలాంటి సమస్య రాకూడదని కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్త వారికే ఎక్కువ సీట్లు ఇచ్చారు. అంతే కాదు.. విజయన్ కూడా మళ్లీ పోటీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు. అందుకే విజయన్ అంతా కొత్త వారికే మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మరి ఈ నిర్ణయం పార్టీకి ఎంతవరకూ మేలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: