నన్ను ఏ రేంజ్లో కొట్టారంటే.. కోర్టులో భోరుమన్న రాజుగారు..?
ఆ సమయంలో తనపై జరిగిన దాడిని రఘురామ కృష్ణంరాజు కోర్టుకు వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ రఘురామ.. సీఐడీ విచారణలో ఉన్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని రఘురామ కృష్ణంరాజు చెప్పారట. ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు రబ్బరు స్టిక్కులతో దాడి చేసినట్లు రఘురామ కోర్టులో చెప్పారట.
ముందుగా తనను కాళ్ళు కట్టేశారని.. ఆ తర్వాత విచక్షణారహితంగా కాళ్లపై దాడి చేశారని రఘురామ కృష్ణంరాజు న్యాయమూర్తికి వివరించినట్టు తెలిసింది. నిందితుడి గాయాలను తను పరిశీలించినట్లు తెలిపిన న్యాయమూర్తి.. ఈ పరిస్థితిలో నిందితుడి గాయాలపై వైద్యపరీక్షలు అవసరమని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గుంటూరు ప్రభుత్వ అసుపత్రితోపాటు రమేష్ హాస్పిటల్ డాక్టర్లు పరీక్షించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అంతే కాదు.. నిందితుడికి ఉన్న వై కేటగిరీ భద్రత నడుమే వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించారు. రెండు ఆస్పత్రుల వైద్యులు గాయాలపై తమ నివేదిక కోర్టుకు సమర్పించాలని.. నివేదికలో తమ అభిప్రాయాన్ని జోడించి ఇవ్వాలన్న సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినట్టు తెలుస్తోంది. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రఘురామకృష్ణం రాజుకు కోర్టు 28 వరకూ రిమాండ్ విధించింది.
నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారంటున్న రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నాయి. చట్టప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారి ఎంపీని తీవ్రంగా హింసించడం తగదని విపక్షాలు అంటున్నాయి. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలని తుంగలో తొక్కిన జగన్ సర్కార్ గూండా రాజ్యాన్ని నడుపుతోందని మండిపడుతున్నాయి.