కరోనాపై కేరళ కొత్త ఆయుధం- ట్రిపుల్ లాక్‌డౌన్‌.. అదేంటో తెలుసా..?

Chakravarthi Kalyan
కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. చిన్న రాష్ట్రమే అయినా అక్కడ కొత్త కరోనా కేసుల సంఖ్య 30 వేల వరకూ ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు అక్కడ ఇటీవలే ఎన్నికలు జరగడంతో ఆ ప్రభావం కూడా ఉంది. అయితే పరిపాలనలో మంచి మార్కులు తెచ్చుకుని ఇటీవలే రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పినరయి విజయన్ కరోనా కట్టడి కోసం కొత్త వ్యూహాలు అమలులోకి తెస్తున్నారు.

అలాంటి ఓ వ్యహమే.. ట్రిపుల్ లాక్‌ డౌన్.. ఇప్పుడు విజయన్ సర్కారు కరోనా వైరస్‌ కట్టడి కోసం మే 16 నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అమలు చేయబోతోంది. అసలు ఇంతకీ ఈ ట్రిపుల్ లాక్‌డౌన్ అంటే ఏంటనుకుంటున్నారా.. ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ అనేది మూడు అంచెల కరోనా కట్టడి వ్యూహం. ఈ ట్రిపుల్ లాక్‌డౌన్‌ను మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ కార్పొరేషన్‌ పరిధిలో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలు, వ్యక్తులను కూడా బయటకు, లోపలికి అనుమతించరు.

ఇక ట్రిపుల్ లాక్‌డౌన్ రెండో దశలో కరోనా కేసులు నమోదయ్యే  క్లస్టర్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఉండటం వల్ల లాక్‌డౌన్‌ తో కరోనా  వ్యాపించకుండా అడ్డుకుంటారు. ఈ రెండింటి తర్వాత మూడో దశ. ఇందులో కరోనాతో చికిత్సపొందుతున్న వ్యక్తుల ఇళ్లల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. అంటే మరింత క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయడం అన్నమాట.

ఇలా మూడు దశల్లో లాక్‌ డౌన్ అమలు చేయడమే ట్రిపుల్ లాక్‌డౌన్ విధానం. మరి ఇంతగా లాక్‌డౌన్ అమలు చేస్తే నిత్యావసరాల సంగతేంటనుకుంటున్నారా.. అవన్నీ ప్రభుత్వమే అందిస్తుంది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్‌, మలప్పురం జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధించబోతున్నారు. మరి ఈ ప్లాన్ సక్సస్ అయితే.. దేశం మొత్తం ఈ విధానమే పాటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: