తిరుపతిలో దారుణం.. ఆక్సిజన్ అందక 22 మంది మృతి..?

Chakravarthi Kalyan
ఆక్సిజన్ సకాలంలో అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వాళ్ల కళ్ల ముందే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలోని కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ అందక 22 మంది వరకూ రోగులు మరణించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలడంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. 22 మంది మరణించగా... మరో 13 మంది ప్రాణాలతో పోరాడుతున్నట్టు తెలుస్తోంది. వీరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా.. ఆక్సిజన్ నింపేటప్పుడు తగినంత కంప్రజర్ లేకపోవడం వల్ల కొద్దిసేపు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగిందని రోగుల బంధువులు చెబుతున్నారు. లోపం గుర్తించి ఆక్సిజన్‌ సరఫరా ప్రారంభించినా  పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. పెద్ద ఎత్తున రోగులు మృత్యువాత  పడ్డారు. వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రోగుల బంధువులు చెబుతున్నారు.
రోగుల మృత్యువాతతో వారి బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి మారుమోగింది. కొందరు రోగుల బంధువులు.. ఆసుపత్రిలోని మందులను చిందర వందర చేశారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టారు. ఈ ఉద్రిక్తతతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు.  ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారని చెప్పిన వారు కూడా ఆక్సిజన్ అందక చనిపోయారని రోగుల బంధువులు విలపిస్తున్నారు. ఆక్సిజన్ లోపాలతో ఒకే ఆసుపత్రిలో 22 మంది వరకూ చనిపోవడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం. గతంలో మహరాష్ట్రలో ఓ ఆసుపత్రిలో దాదాపు 15 మంది వరకూ ఆక్సిజన్ అందక చనిపోయారు.
ఈ ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే రాత్రి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్‌ ప్రెజర్‌లో మార్పులు వచ్చాయని కలెక్టర్ చెబుతున్నారు. ఆక్సిజన్‌ ప్రెజర్‌ తగ్గడం వల్ల కొందరు చనిపోయారని అంటున్నారు. వెంటనే ఆక్సిజన్‌ను పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని  కలెక్టర్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు నిర్ధరణ అయ్యిందని కలెక్టర్ చెబుతున్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో 5 నిమిషాల ఆలస్యం జరిగిందని ప్రస్తుతానికి తెలిసిందని.. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని  కలెక్టర్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: