తలనీలాల వ్యవహారం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కేసు..?
అయితే అసలు అసోంలో దొరికిన వెంట్రుకల టీటీడీవే కాదంటోంది టీటీడీ. తిరుమల, తిరుపతి దేవస్థానాలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం రాష్ట్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేయగా, దాదాపు నెలన్నర తర్వాత ఆ సంఘటనను టీటీడీకి ఆపాదిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేశారని గుర్తు చేస్తోంది. జప్తు చేసిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేసింది.
దీంతో ఇది ఎల్లో మీడియా కుట్ర అంటన్న ప్రభుత్వం.. భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు పెడుతోంది. మంగళవారం రాత్రి తిరుపతి ఈస్ట్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు
టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపులపై కేసులు పెట్టారు.
రామ రాజ్యం మళ్లీ మొదలైంది, గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ వంటి ఫేస్‌బుక్ పోస్టులపైనా కేసులు నమోదయ్యాయి. ఫేస్‌బుక్‌లో ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు.