రాపాకను ఫ్లెక్సీతోనే రఫ్ఫాడించిన జన సైనికులు..!?

Chakravarthi Kalyan
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. కనీసం 30 నుంచి 40 స్థానాలు సాధించి పవన్ కల్యాణ్ కింగ్ మేకర్‌ అవుతాడని అప్పట్లో అంచనాలు ఉండేవి.. ఆ అంచనాలతోనే పవన్ కల్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేశారు. అయితే ఫలితాలు మాత్రం జనసైనికులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. చివరకు పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ తరపున రాజోలు నుంచి ఎమ్మెల్యేగా రాపాక వర ప్రసాద్ మాత్రమే విజయం సాధించారు.

అలా జనసేన తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ నిలిచారు. పోనీ.. ఒక్కడు మాత్రమే గెలిచినా అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది కదా అనుకుంటే.. సదరు రాపాక వరప్రసాద్ గెలిచిన కొన్ని రోజులకే వైసీపీ పాట పాడటం మొదలు పెట్టాడు.. తాను గెలిచింది తన ఛరిష్మాతోనే తప్ప.. జనసేన బలంతో కాదంటూ కొత్త రాగం ఆలపించారు. అంతే కాదు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. వైసీపీ నాయకులతో దోస్తీ .. ఇవన్నీ చూస్తే.. ఆయన వైసీపీతోనే తన భవిష్యత్ ఉందని నిర్ణయించుకున్నట్టు తేలిపోయింది.

ఇక అప్పటి నుంచి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసైనికులకు టార్గెట్ గా మారాయి. జనసైనికుల ఓట్లతో ఎమ్మెల్యే అయిన రాపాక ఆ తర్వాత వైసీపీ వైపు వెళ్లడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేక పోయారు. అప్పటి నుంచి రాపాకకు జనసైనికులు ఏదో రూపంలో షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే తాజా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన ఫలితాలు రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో జనసేన సత్తా చాటింది. అందులోనూ రాజోలు నియోజక వర్గంలో జనసేన మంచి ఫలితాలే సాధించింది. అందుకే జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాక్ ఇచ్చేలా ఆ ప్రాంతంలోనే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఆ బహిరంగ సభ ప్రాంతంలోజనసేన క్యాడర్ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావద్దంటూ ఏకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. రాపాకా.. ఇటు రామాకా.. అంటూ ఆ ఫ్లెక్సీలో రాశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో నిర్వహించిన జనసేన సభకు రాపాక వరప్రసాద్ రావద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: