సీఎంలూ.. మీరూ అమ్మేయండి.. మంచి ఇన్‌సెంటివ్ ఇస్తా.. మోడీ పిలుపు..!?
అంతే కాదు..ఇప్పుడు తాను అమ్మడమే కాదు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కూడా మీ కంపెనీలు అమ్మేయండి అంటూ ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై పార్లమెంటులో ఓ మంత్రి చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటంటే.. రాష్ట్రాల పరిధిలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం చేపట్టే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తారట. ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేశామంటూ కేంద్రం చెబుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ విషయంపై తెలంగాణ ఎంపిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని 2021-22 బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారని చెప్పిన మేఘ్వాల్... వ్యూహాత్మకం, వ్యూహాత్మకం కాని రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అవసరమైన మార్గసూచికను ఈ విధానం అందిస్తోందని చెబుతున్నారు. అంటే.. తమ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిన రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నమాట.
అంతే కాదు.. ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న పరిశ్రమలను సకాలంలో మూసివేయడానికి కొత్త యంత్రాంగాన్ని ప్రవేశపెడతారట. తగిన కసరత్తు అనంతరం ఖాయిలా పడిన, నష్టాలు మూటగట్టుకుంటున్న సంస్థల మూసివేతకు సంబంధించి సవరించిన విధి విధానాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఖరారు చేసి నోటిఫై చేస్తుందని ఈ మంత్రి చెబుతున్నారు.