జగన్ పిండ ప్రదానం.. అలా చేయకూడదా..!?

Chakravarthi Kalyan
వైసీపీ అధ్యక్షుడు జగన్ గోదావరి పుష్కరాలకు హాజరై పవిత్ర స్నానం చేయడం, తన తండ్రికి పిండప్రదానం చేయడం వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ క్రిష్టియన్ అన్న సంగతి జగమెరిన విషయమే. జగనే కాదు.. ఆయన కుటుంబం మొత్తం.. తన తాతల హయాం నుంచి క్రైస్తవం స్వీకరించారు. జగన్ ఇటీవలే కోర్టు నుంచి అనుమతి పొంది మరీ జెరూసలేం వెళ్లి వచ్చారు.

క్రిస్టియన్ అయిన జగన్.. హైందవ సంస్కృతి ప్రకారం ఎలా పిండప్రదానం చేస్తారని కొన్ని హిందూ సంస్థల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. జగన్ పిండ ప్రదానం చేసే సమయంలో ఆయన మెడలో సన్నని గొలుసు.. దాని చివరి చిన్న సిలువ ఉన్నాయి. కానీ జగన్ హిందువుల మాదిరిగానే చొక్కా విప్పి.. బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పిండప్రదానం చేశారు. 

మెడలో సిలువ గొలుసుతో పిండప్రదానమా..?


సిలువ గొలుసు మెడలో వేసుకుని జగన్ పిండ ప్రదానం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ హిందువుల ఓట్ల కోసమే అలా పుష్కరస్నానం, పిండప్రదానం చేశారని కొందరు విమర్శిస్తున్నారు. ఒక వేళ మనస్ఫూర్తిగా పుష్కరస్నానం, పిండప్రదానం చేయాలనుకుంటే.. సిలువ తీసేని చేసి ఉండాల్సిందని వాదిస్తున్నారు. 

జగన్ అభిమానులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. తాను ఓ క్రిస్టియన్ అయినా.. అన్ని మత విశ్వాసాలను గౌరవించే ఉద్దేశంతోనే జగన్ పుష్కర స్నానం, పిండప్రదానం చేశారని చెబుతున్నారు. జగన్ మత సామరస్యానికి ప్రతీకగా నిల్చారని, హిందూ మతంపై గౌరవంతోనే పుష్కరస్నానం చేశారని, ఇందులో తప్పు పట్టాల్సినవసరం ఏమీ లేదని వాదిస్తున్నారు. ఇలా చివరకు పుష్కర స్నానం కూడా కాంట్రావర్సీ అయ్యిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: