పురపోరు: ఏపార్టీకి ఎన్ని ఏకగ్రీవాలు.. ఇదిగో లిస్టు..?

Chakravarthi Kalyan
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఉపసంహరణల గడువు ముగిసింది. ఇక ఎన్నికలే మిగిలాయి. మరి నామినేషన్ల ఉపసంహరణల తర్వాత బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలింది. ఏకగ్రీవాలపై ఓ అయిడియా వచ్చింది. అయితే ఈ ఏకగ్రీవాల్లో అధికార పార్టీ ఎవరికీ అందనంత ఎత్తులో కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికలను ఏకగ్రీవం చేసుకుంది. వీటితో పాటు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఆరు చోట్ల అధికార పక్షానికి సగానికంటే ఎక్కువ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
ఆ ఆరు స్థానాల వివరాలు చూస్తే.. కడప జిల్లా రాయచోటి పురపాలక సంఘంలోనూ 34 వార్డుల్లో 31 చోట్ల, యర్రగుంట్ల నగర పంచాయతీలోని 20 వార్డుల్లో 12 చోట్ల, కర్నూలు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘంలో 24 వార్డుల్లో 14 చోట్ల, డోన్‌లోని 32 వార్డుల్లో 25 చోట్ల, చిత్తూరు నగరపాలక సంస్థలోని 50 డివిజనుల్లో 37 చోట్ల, పలమనేరులోని 26 వార్డుల్లో 18 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే ఆ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్లిపోయినట్టే.. అక్కడ ఎన్నికలు జరిగినా నామమాత్రమే.
ఇక ఏకగ్రీవాల లెక్కలు చూస్తే.. ముగిసిన ఉపసంహరణల ప్రక్రియ అనంతరం మొత్తం 578 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఒక్క వైకాపా అభ్యర్థులే 570 చోట్ల ఏకగ్రీవం అయ్యారు. ప్రతిపక్ష వైసీపీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఏకగ్రీవం అయ్యారు. ఇక బీజేపీ నుంచి ఒకరు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ లెక్కలు చూస్తే వైసీపీ భారీ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు చేసిందనే చెప్పాలి.
అయితే.. తమ అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యాలకు దిగారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల అపహరించి ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో మొత్తం 2,794 స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళ, బుధవారం ఉపసంహరణల తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: