విజయసాయి రెడ్డికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గంటా..? పరువు పోయిందిగా..?
రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైయస్ఆర్‌సీపీలో చేరారని విజయసాయిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు వైయస్ఆర్‌సీపీకి పట్టం కట్టారని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఇదే వేదికపై విజయసాయిరెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. కాశీ విశ్వనాథే కాదు.. గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటూ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ మేరకు గతంలో గంటా శ్రీనివాసరావు జగన్ కు ప్రతిపాదనలు పంపారని విజయసాయిరెడ్డి అన్నారు.
సీఎం జగన్ అనుమతి తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయమైపోయందని అంతా అనుకున్నారు. కానీ.. సాయంత్రానికి ఈ అంశంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు గతంలోనూ చాలా సార్లు ప్రచారం జరిగిందని.. కానీ ఇవేమీ నిజం కాదని కుండబద్దలు కొట్టేశారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. మరి విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్న గంటా.. తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయిరెడ్డే చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు.
గంటా అనూహ్యంగా ఎదురుదాడి చేయడంతో విజయసాయిరెడ్డి డిఫెన్సులో పడిపోయారు. గంటా స్పందనపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. వైసీపీలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపిన మాట నిజమేనని.. గంటా ప్రతిపాదనపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పునరుద్ఘాటించారు. మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం మా పార్టీకి లేదన్న విజయసాయిరెడ్డి.. గంటా వచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని ముక్తాయించారు.