మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?

Chakravarthi Kalyan
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లో ఇటీవల జరిగిన చర్చలో బీజేపీ నేత‌.. విష్ణువ‌ర్ధన్ రెడ్డిపై  ఏపీ ప‌రిర‌క్షణ స‌మితి అధ్యక్షుడు కొటిక‌లపూడి శ్రీనివాస్ చెప్పు విసిరారు. రాజ‌ధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేద‌ని కొటిక‌లపూడి మొదట విమ‌ర్శించారు. దీనికి విష్ణువ‌ర్ధన్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సమయంలో నువ్వు టీడీపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నావు. ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో అంటూ.. విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ సంయ‌మ‌నం కోల్పోయి.. కాలి చెప్పుతో ప‌క్కనే కూర్చున్న విష్ణువ‌ర్ధన్‌ రెడ్డిపై చెప్పు విసిరారు. చెప్పు విష్ణువ‌ర్ధన్‌ రెడ్డి కుడి భుజానికి చెప్పు త‌గిలి కింద‌ప‌డింది.
ఈ ఘటనపై బీజేపీ సీరియస్‌ గా స్పందించింది. భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.  పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నదని అధకారికంగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించలేదని బీజేపీ ఆరోపించింది.
దీనిపై తాజాగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ స్పందించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడిపోయారని ఆర్కే అంటున్నారు. అలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌‌‌రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు తదితరులు ఉన్నారని... ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి పనిచేస్తుంటారని స్థానిక బీజేపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.
అయినా, కేంద్రప్రభుత్వాన్ని చూసి భయపడటానికి నేనేమీ జగన్మోహన్‌ రెడ్డి లేదా చంద్రబాబునాయుడుని కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. జగన్, చంద్రబాబు.. ఇద్దరూ రాజకీయ నాయకులు కనుక వారి సమస్యలు వారికి ఉంటాయని.. తానేమీ రాజకీయ నాయకుణ్ణి కానని ఆర్కే అంటున్నారు. తాను ఒక సాధారణ జర్నలిస్టును మాత్రమేనని.. వీర్రాజు అండ్‌ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: