ఏపీ: గతంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వారు ఇపుడు కనబడలేదేమిటి?

Suma Kallamadi
బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్లవుతాయి. అధికారం వుంది కదాని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఎదో ఒకరోజు కాలమే సమాధానం చెబుతుంది. అవును, అధికారమదంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిందే జరిగింది. గతంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వారు ఇపుడు కనబడపోవడానికి కారణం ఇదే. తాను ఎవరి సాయంతో అధికారంలోకి రావడం జరిగిందో వాళ్లందర్నీ అవమానించి, వేధించడంతోనే వారు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ తరపున వచ్చే వారే కనబడడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు.. తాము స్వతంత్ర అభ్యర్థులమేమో అన్నట్లుగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోందిపుడు.
ఇకపోతే జగన్ కోసం గత ఎన్నికల్లో ఎంతో మంది పని చేసారో తెలుసా? సొంత కుటుంబంలోని తల్లి విజయమ్మ దగ్గర్నుంచి సినిమాల్లోని మోహన్ బాబు, అలీ, ఫృధ్వీ వరకూ ఇలా చాలా మంది ప్రచారం చేశారు. ఆనాడు ఎన్నికలకు ముందు చాలా నియోజకవర్గాల్లో తిరిగారు. ఇపుడు దాదాపుగా వీరిలో అందరూ దూరమయ్యారు. చివరికి అలీ కూడా ప్రచారానికి రాకపోవడం కొసమెరుపు. పోనీ మోహన్ బాబును అడిగే ధైర్యం ఇప్పుడు వైసీపీ నేతలకు లేదు. వైసీపీ దుస్థితి చూసి ఆ పార్టీ నేతలకే విరక్తి పుడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. అధికారం వచ్చిన తర్వాత అందరూ దూరమయ్యారు.
మరో వైపు కూటమి కోసం స్టార్ క్యాపంపెయినర్లు సైతం ఇపుడు బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ సభలకు అయితే ప్రజలు పోటెత్తుతున్నారు. తాజాగా ఫృధ్వీ, వరణ్ తేజ్, అంబటి రాయుడు, పలు సీరియల్, సినిమా జూనియర్ ఆర్టిస్టులు సహా అనేక మంది రంగంలోకి దిగి ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో వైసీపీ దుస్థితి చూసి జాలిపడిన పరిస్థితి ఏర్పడింది. అధికారం నెత్తికెక్కించుకుని అంతా తన వల్లే అనుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో కళ్ల ముందు కనిపిస్తుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ మేలుకొని మంది దారిలో పయనించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: