నిజ్జంగా నిజం.. గాడిద బిర్యానీ.. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో ఇదే ఫేమస్..?

Chakravarthi Kalyan
మాంసాహారం.. మనకు కొత్తేమీ కాదు.. కానీ.. మాంసాహారంలోనూ అన్ని జంతువులనూ అందరూ తినరు. మెజారిటీ జనం తినే జంతువులు కొన్నే ఉంటాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు వరకూ పెద్దగా అభ్యంతరాలు కనిపించవు.. కానీ.. కుక్కలు, పిల్లులు, గాడిదలు.. ఇలాంటి జంతువులను తినేవాళ్లు తక్కువగానే ఉంటారు..  కానీ ఇప్పుడు ఆంధ్రాలో గాడిద మాంసానికి చాలా డిమాండ్ ఉందట. ఈ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందట.

సాధారణంగా గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అవి పిల్లలకు తాగిస్తే.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటారు. అందుకే నగరాల్లోనూ గాడిదలను వెంట తిప్పుకుంటూ వాటి పాలు అమ్మేవారు కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు గాడిద మాంసానికి డిమాండ్ పెరిగిందట.  ఏపీలో గాడిదలను బతకనివ్వడం లేదు బాబోయ్.. అంటూ సురాబత్తుల గోపాల్ అనే జంతు సంరక్షణ సంస్థ కార్యదర్శి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడట. గాడిదలు క్రమేపీ అంతరించిపోతున్న జాబితాలో చేర్చేయాల్సి ఉంటుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశేషం ఏంటంటే.. మన దగ్గర దొరికే గాడిదలు సరిపోవడం లేదట ఆ మాంసం గిరాకీకి.. అందుకే ఏపీలోని గాడిదలు సరిపోక.. కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా గాడిదలను దిగుమతి చేసుకుంటున్నారట. అందుకే ఇకనైనా ప్రభుత్వం పూనుకుని గాడిదలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఉన్నట్టుండి గాడిదల మాంసానికి అంత డిమాండ్‌ ఎందుకు వచ్చిందో తెలుసా..?

గాడిద మాంసాన్ని తింటే.. ధాతుపుష్టి పెరుగుతుందని.. లైంగిక సామర్థ్యం పెరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు.. కానీ ఈ మాటలు చెవికెక్కితే కదా.. అందుకే.. ఏపీలో గాడిదలు మాయమైపోతున్నాయట. కొన్ని జిల్లాల్లో అసలు చూద్దామన్నా సరే గాడిదలు కనిపించడం లేదట. గాడిద బిర్యానీలు, గాడిద కబాబ్‌లు, గాడిద పాయ, గాడిద కార్జం.. ఇలా రకరకాల వెరైటీలు చేసుకుని తింటు న్నారట జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: